నేను వంద శాతం హిందువునే : వై.వి.సుబ్బారెడ్డి

నేను వంద శాతం హిందువునే : వై.వి.సుబ్బారెడ్డి

తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్ట దైవమని మాజీ ఎంపీ, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఖరారైన వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే.. కొందరు వ్యతిరేకులు తనను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాల్లో మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.

సీఎం జగన్‌ కు బాబాయి అయిన సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తున్నారనగానే ఆయన క్రిస్టియన్‌ అన్న వార్తలు వెల్లువెత్తాయి. ఓ హిందు ధార్మిక సంస్థ పదవిని క్రిస్టియన్‌కి ఎలా కేటాయిస్తారని, ఎవరినైనా హిందువును ఆ పదవిలో నియమించాలంటూ విమర్శలు పెరగడంతో సుబ్బారెడ్డి ఈ అంశంపై అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు. తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. టీటీడీ ఒక్కటే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు వై.వి.సుబ్బారెడ్డి.