అప్పుడు నవ్వారు.. ఇప్పుడు కష్టాలు చెప్పుకుని ఏడుస్తున్నరు

అప్పుడు నవ్వారు.. ఇప్పుడు కష్టాలు చెప్పుకుని ఏడుస్తున్నరు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం ఓట్లు ఆయనకే రావడంతో మాన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు ఈ రోజు ఉదయం ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం భగవంత్ మాన్ స్పందిస్తూ పంజాబ్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తానొక సామాన్య సైనికుడినని, సీఎం బాధ్యతలతో పాటు తాను పోస్టర్ బాయ్ డ్యూటీ చేసేందుకూ సిద్ధమేనని చెప్పారు.

పంజాబ్ లో చాలా సమస్యలు ఉన్నాయని, అయితే తాను ముఖ్యమంత్రిగా గెలిస్తే తన మొదటి టార్గెట్ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమేనని భగవంత్ మాన్ అన్నారు. అలాగే రాష్ట్రంలో ‘మాఫియా రాజ్’ను అంతం చేస్తానని చెప్పారు. తానొక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఏనాడూ ఊహించలేదని అన్నారు. రెండింట మూడొంతుల మెజారిటీతో పంజాబ్ లో కొత్త సర్కారు తామే ఏర్పాటు చేస్తామని మాన్ ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడు నవ్వేవారు.. ఇప్పుడు ఏడుస్తున్నారు

రాజకీయాల్లోకి రావడంతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని భగవంత్ మాన్ అన్నారు. తాను గతంలో కామెడీ యాక్టర్ గా ఉన్న సమయంలో ప్రజలను కలిసినప్పుడు వాళ్లు తనను చూసి నవ్వేవారని, కానీ ఇప్పుడు తాను ఏదో మంచి చేస్తానని ప్రజలు తన వైపు ఆశగా చూస్తున్నారని, వారిని కలిస్తే తమ కష్టాలు తీర్చాలంటూ ఏడుస్తున్నారని చెప్పారు. మనల్ని కాపాడడానికి దేవుడున్నాడని, తాను దేవుడికి ఒక వాహకం లాంటి వాడిని మాత్రమేనేనని మాన్ అన్నారు. పంజాబ్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తాను కలలు కన్నానని, ఆ కలలు తనను నిద్రపోనివ్వడం లేదని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా: ప్రియాంకా చోప్రా

రిపబ్లిక్ డే వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ 

ఈ సారి రిపబ్లిక్ డేలో చాలా ప్రత్యేకతలు