హ్యాకింగ్పై పోలీసులకు కంప్లైంట్ చేస్త : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హ్యాకింగ్పై పోలీసులకు కంప్లైంట్ చేస్త : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో  ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్​ చేయిస్తోందని ఆరోపించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను  ఆశ్రయించనున్నట్లు చెప్పారు. "నా  మొబైల్‌ ఫోన్‌ను హ్యాక్ చేసి నా వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతపై దాడి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై  నేను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను  ఆశ్రయించబోతున్నాను" అని ఆర్ ఎస్ ప్రవీణ్ అన్నారు. తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని ఇటీవల  ప్రవీణ్ కుమార్ తెలిపారు.  ఈ విషయంలో తాను జాగ్రత్తగా ఉండాలని మొబైల్ ఫోన్ కంపెనీ తెలిపిందన్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ టూల్స్‌ని ఉపయోగిస్తున్న ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు దాడి చేస్తున్న అతి కొద్ది ఫోన్‌లలో తనది ఒకటని మొబైల్ ఫోన్ కంపెనీ తెలిపిందన్నారు.

టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5, క్లాజ్ 3 ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఐదు వర్గాల వ్యక్తుల మొబైల్ కమ్యూనికేషన్‌లను రాష్ట్రం ట్రాక్ చేయవచ్చు. ఈ వర్గాలలో తాను ఏ వర్గానికి చెందినవాడిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. అలాంటప్పుడు తనని టార్గెట్ చేయడం ఎందుకో తెలుసుకోవాలని ఉందని అన్నారు. తన కదలికలను ట్రాక్ చేయడానికి తానేమైనా ఉగ్రవాదినా అని ప్రశ్నించారు. తన మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడానికి చేసిన ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లుగా వెల్లడించారు.