
హైదరాబాద్, వెలుగు: ముంబైలో జరిగిన ‘లివా మిస్ దివా సుప్రా నేషనల్ –2022’ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ అమ్మాయి ప్రజ్ఞా అయ్యంగారి బుధవారం సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్‌లోని మ్యారియట్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. టైటిల్ గెలుపొందిన సందర్భంగా ప్రజ్ఞ తన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ తో వేడుకలు జరుపుకుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టైటిల్ గెలవడం ద్వారా తన పేరెంట్స్ తో పాటు సిటీకి గౌరవాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. తొందరలో జరగనున్న మిస్ సుప్రా ఇంటర్నేషనల్ కి ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆ టైటిల్ కూడా గెలిచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజ్ఞా ఫ్యాషనింగ్ డిజైనింగ్‌లో మాత్రమే కాకుండా ప్రకృతిని ఎంతగానో ఆరాధిస్తుంది. అందుకే సస్టెయినబుల్ ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రారంభించి పర్యావరణ అనుకూల జీవనం దిశగా ప్రజలను ప్రోత్సహించాలని కోరుకుంటోంది. ఆమె నృత్యం, పెయింటింగ్, కరాటే, అథ్లెటిక్స్ లోనూ ఎన్నో అవార్డ్‌లు అందుకుంది. తొందరలో జరగనున్న మిస్ సుప్రా నేషన్ పీజంట్‌లో ఇండియా తరఫున ప్రజ్ఞ పోటీ పడనుంది.