రాహుల్​ ప్రేమ దుకాణం

రాహుల్​ ప్రేమ దుకాణం
  • యాత్ర ఎందుకనేవారికి ఇదే నా సమాధానమన్న రాహుల్ గాంధీ

ఢిల్లీ : తాను చేస్తున్న‘భారత్ జోడో పాదయాత్ర’పై రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను. నా యాత్ర ఎందుకోసం అనే వారికి ఇదే నా సమాధానం' అని రాహల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా  ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల రాహుల్ గాంధీ మాట్లాడారు. 

"నేను విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను. నేను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాను అని అడిగే బీజేపీ నాయకులకు ఇది నా సమాధానం" అని అన్నారు. భారత్ జోడో యాత్ర100 రోజులు పూర్తి చేసుకుందన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్‌లో కొనసాగుతోందని వివరించారు. 

‘‘నేను వెళ్లే దారిలో ఇతర స్నేహితులను కూడా కలుస్తాను. సాధారణంగా వాళ్లు బీజేపీ కార్యాలయంపైనా నిల్చుంటారు. నేను అటుగా వెళ్తున్నప్పుడు వారికి కూడా నేను నమస్కరిస్తాను. చేతులు ఊపుతూ ద్వేషం యొక్క మార్కెట్‌లో నేను ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను. మీరు నన్ను ద్వేషిస్తారు. మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు. కానీ.. మీ దుకాణం ద్వేషపూరితమైనది. అయితే.. నా దుకాణం ప్రేమతో కూడుకున్నది. ఇది నా దుకాణం మాత్రమే కాదు. ఇది మొత్తం సంస్థ యొక్క దుకాణం. స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, ఆజాద్ అందరూ విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాలు తెరిచారు. నేను కూడా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మన మతం.. మన దేశం.. అంతా ప్రేమే తప్ప ద్వేషం కాదు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

రాజస్థాన్ ప్రభుత్వంపై రాహుల్ ప్రశంసలు

రాజస్థాన్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ  ప్రశంసలు కురిపించారు. దేశంలో పేదల కోసం ఉత్తమమైన పథకాలు రాజస్థాన్‌లో అమలవుతున్నాయని అన్నారు. కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పాదయాత్ర చేసినప్పుడు  ప్రజలు తనను కలసి తమకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉందని.. అయితే తమ వద్ద డబ్బులు లేవని చెప్పారని గుర్తు చేసుకున్నారు.  రాజస్థాన్‌ రాష్ట్రంలో మాత్రం ఇలా జరగడం లేదని గుర్తించానన్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో చిరంజీవి యోజన పథకం లక్షల మంది హృదయాలలో నుండి భయాన్ని తొలగించిందని ప్రజలు చెప్పారని..అందుకే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బహుశా ఈ పథకం దేశం మొత్తానికి కొత్త మార్గం చూపుతుందని రాహుల్ గాంధీ అన్నారు.

గత సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఇప్పుడు రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఎనిమిది రాష్ట్రాల్లో శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర ఈనెల 24వ తేదీన ఢిల్లీలో ప్రవేశించనుంది. ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, చివరగా జమ్మూ కాశ్మీర్‌లో జరగనుంది.