నవమిలోపు తేల్చకుంటే.. సజీవ సమాధి అవుతా..ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేసిన మాజీ డీఎస్పీ నళిని

నవమిలోపు తేల్చకుంటే.. సజీవ సమాధి అవుతా..ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేసిన మాజీ డీఎస్పీ నళిని

యాదాద్రి, వెలుగు : ‘తన విషయాన్ని నవమి లోపు తేల్చకుంటే సజీవ సమాధి అవుతా’ అని మాజీ డీఎస్పీ నళిని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ‘మరణ వాంగ్మూలం’ పేరుతో తన ఫేస్‌‌బుక్‌‌ పేజీలో పోస్ట్‌‌ చేశారు. సంధ్య థియేటర్‌‌ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని వారం రోజుల్లో ఆదుకున్న ప్రభుత్వం.. తన విషయంలో కావాలనే ఆలస్యం చేస్తోందన్నారు.

 ‘ఏ అధికారినైనా సస్పెండ్ చేస్తే ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి, ఆ టైంలో సగం లేదంటే మూడో వంతు జీతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది, నేను 21 నెలల క్రితం ఇచ్చిన రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదు’ అని పేర్కొన్నారు. 

తాను సీఎంను కలిసి రిపోర్ట్‌‌ ఇచ్చినప్పుడు సీఎస్, ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ పరిశీలిస్తారని చెప్పి ఆ తర్వాత ఓఎస్‌‌డీ శ్రీనివాస్‌‌కు అప్పగించారన్నారు. ఇప్పుడు తన బ్యాచ్‌‌మేట్‌‌ అయిన హనుమంతరావు చేతుల్లో పెట్టి తన స్థాయిని తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవమి నాటికి తన విషయాన్ని తేల్చకపోతే సజీవ సమాధి అవుతానని ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేశారు.