నా నోబెల్ ప్రైజ్ ట్రంప్‎కు అంకితం చేస్తున్నా: కొరీనా మచాడో కీలక ప్రకటన

నా నోబెల్ ప్రైజ్ ట్రంప్‎కు అంకితం చేస్తున్నా:  కొరీనా మచాడో కీలక ప్రకటన

ఓస్లో: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కడంపై వెనిజులాకు చెందిన కొరీనా మచాడో స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ‘‘ఈ బహుమతిని వెనిజులాలో బాధల్లో ఉన్న ప్రజలకు, మా పోరాటానికి మద్దతు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను’’ అని కొరీనా పేర్కొన్నారు. తనను నోబెల్ పీస్ ప్రైజ్ వరించడంతో ఎట్టకేలకు వెనెజులా ప్రజల పోరాటానికి తగిన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ గుర్తింపు మా పోరాటానికి మరింత ప్రోత్సహాన్ని ఇచ్చిందన్నారు. మా పోరాటానికి మద్దతు తెలిపిన ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విజయం అంచునా ఉన్నామని.. మేము సాధించాల్సిన దాని కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఏదో రోజు మేము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కడంతో నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎కు నిరాశే మిగిలింది. ప్రపంచంలో శాంతి స్థాపనకు తాను ప్రయత్నం చేస్తున్నానని, తన వద్ద ఉన్న టారిఫ్స్ అనే ఆయుధంతో శాంతి నెలకొల్పుతున్నానని చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్‎కు ఎదురు దెబ్బ తగిలింది.

ఈ క్రమంలో తన నోబెల్ బహుమతిని ట్రంప్‎కు అంకితం చేస్తున్నట్లు అవార్డ్ విజేత కొరీనా మచాడో ప్రకటించడం ప్రపంచవ్యా్ప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. పాపం ఆశాభంగానికి గురైన ట్రంప్‎కు ఈ విధంగానైనా నోబెల్ బహుమతి దక్కిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

కాగా, 2025 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాడోకు లభించింది. శుక్రవారం ( అక్టోబర్​10) మచాడో పేరును నార్వేజియన్​నోబెల్​కమిటీ ప్రకటించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం విశేష కృషి చేసినందుకు గాను మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసినట్లు కమిటీ స్పష్టం చేసింది.

ఈ బహుమతిని డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో విజేతకు ప్రదానం చేస్తారు. నోబెల్​ శాంతి బహుమతికి గ్రహీతలకు బంగారు పతకం, డిప్లోమా, రూ. 8.7 కోట్ల నగదు బహుమతిని అందిస్తారు. బహుమతి నగదును నోబెల్​ ఫౌండేషన్​సమకూరుస్తుంది.