నా కొడుకుకు పదవి ఇవ్వాలని కోరలేదు: జానారెడ్డి

నా కొడుకుకు పదవి ఇవ్వాలని కోరలేదు: జానారెడ్డి

హైదరాబాద్, వెలుగు : పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో  అన్ని రకాల శాఖలకు మంత్రిగా పనిచేసినట్లు గుర్తుచేశారు. తన కొడుకు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌‌‌‌ రెడ్డికి పదవులు అడిగినట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.  సీఎం రేవంత్‌‌ రెడ్డి సోమవారం ఉదయం జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. జానారెడ్డి దంపతులు రేవంత్‌‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. సుమారు గంట పాటు రేవంత్‌‌, జానారెడ్డి పలు అంశాలపై మాట్లాడుకున్నారు.

అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కొత్త సీఎంగా పదవి చేపట్టిన రేవంత్‌‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు  చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ప్రజాభిమానాన్ని సొంతం చేసుకునేలా పని చేయాలని సూచించినట్లు వెల్లడించారు. తన కొడుకు జయవీర్‌‌‌‌ రెడ్డి‌‌ చాలా జూనియర్ అని..ఇప్పుడే పదవులు అవసరం లేదన్నారు. జయవీర్‌‌‌‌ రెడ్డికి పదవులు ఇవ్వాలని సీఎంను అడిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాను ప్రభుత్వానికి బయటి నుంచే తన సహకారం అందిస్తానని జానారెడ్డి పేర్కొన్నారు. సివిల్ సప్లైస్‌‌, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి కూడా సోమవారం ఉదయం జానారెడ్డిని కలిశారు.