అఫ్గాన్ ప్రజలను మంచిగా చూసుకుంటామని తాలిబన్లు చెప్పారు

అఫ్గాన్ ప్రజలను మంచిగా చూసుకుంటామని తాలిబన్లు చెప్పారు

అఫ్గాన్‌పై తాలిబన్ల అధిపత్యాన్ని అంగీకరిస్తున్న ధోరణిలో పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్స్ చేశారు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం)  వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని ఈ సందర్భంగా బైడెన్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తాలిబన్ల పైనే ఉందని ఆయన కామెంట్ చేశారు. ఈ సమయంలో అక్కడున్న రిపోర్టర్ ఒకరు మీరు తాలిబన్లను నమ్ముతున్నారా అంటూ అధ్యక్షుడిని ప్రశ్నించారు. దానికి తాను ఎవరినీ నమ్మడం లేదని ఆయన సమాధానమిచ్చారు. అయితే అఫ్గాన్ ప్రజలను ఐక్యంగా ఏకతాటిపైకి తేవడంతో పాటు వారిని మంచిగా చూసుకోవడానికి తాలిబన్లు ప్రయత్నించాలనుకుంటున్నారా లేదా అనే దానిపై వాళ్లు ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అక్కడ ఈ విషయంలో గడిచిన వందేళ్లలో ఎవరూ సక్సెస్‌ కాలేదని బైడెన్ అన్నారు. తాలిబన్లు ఆ ప్రయత్నం చేయాలనుకుంటే వారికి ఆర్థిక సాయంతో పాటు వ్యాపార, వాణిజ్య పరంగా, ఇతర అంశాల పరగంగా ప్రపంచ దేశాల నుంచి సహకారం అవసరమవుతుందని చెప్పారు. 

అఫ్గాన్ ప్రజల సంక్షేమాన్ని తాము చూసుకుంటామని, శాంతియుతంగా పాలిస్తామని తాలిబన్లు చెప్పారని, అయితే వాళ్లు ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా చూడాల్సి ఉందంటూ బైడెన్ కామెంట్స్ చేశారు. అఫ్గాన్‌లో తమ పాలనను గుర్తించాలని తాలిబన్లు కోరుతున్నారని, అమెరికాతో పాటు ఇతర దేశాలను కూడా వాళ్లు రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. అలాగే యూఎస్‌తో పాటు ఇతర దేశాలు తమ దౌత్య కార్యాలయాలను అఫ్గాన్‌లో కొనసాగించాలని కూడా కోరుతున్నారని అన్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయని, తాలిబన్లను ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా లేదా అనేది ఇప్పుడే తెలియదని బైడెన్ అన్నారు.