- బాధితులందరినీ ఆదుకుంటాం
ముదిగొండ, వెలుగు : "మీ కష్టాలను తీర్చడానికి, మీ కన్నీళ్లు తుడవడానికే నేను వచ్చాను. మీరు అధైర్య పడకండి.. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది’ అని వరద ముంపు ప్రాంతాల బాధితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
మంగళవారం మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎస్సీ కాలనీకి వరద ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత పండ్రేగుపల్లి లో మున్నేరు కరకట్ట తెగి ఇండ్ల లోకి నీరు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించారు. కరకట్ట తెగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేయించిన తర్వాత పరిహారం అందిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. పండ్రేగుపల్లి తండాలో వర్షానికి కూలిపోయిన ఖమ్మం -కూసుమంచి 132 కేవీ హై టెన్షన్ టవర్ ను పరిశీలించి వెంటనే రిపేర్లు చేయాలని ఏడీ బాబు నాయక్ ను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందజేయాలని తహసీల్దార్ కరుణాకర్ రెడ్డిని ఆదేశించారు.