మంత్రి పదవినే వదిలేశా.. పదవులు ఓ లెక్కా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి పదవినే వదిలేశా.. పదవులు ఓ లెక్కా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కమిటీల్లో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలోనూ ఉండొచ్చు.. మంత్రి పదవినే వదిలేశా.. పదవులు ముఖ్యం కాదు.’’ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేయబోతున్నానని... ఇందులో అనుమానం అవసరం లేదని ప్రకటించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  జనవరి నుంచి రెగ్యులర్ గా నల్గొండలో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి అభివృద్ధి, సేవా కార్యక్రమాలే ముఖ్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

టీఆర్ఎస్ నేతలకు దళితబంధు ఇస్తే కోర్టుకెళ్తా

దళిత బంధు టీఆర్ఎస్ నాయకులకు ఇస్తే కోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. దళితబంధు పథకానికి  అర్హులైన వారికి  డ్రా తీసి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాదిలోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300 ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలి గాని.. కేవలం రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదన్నారు. 

సీటొచ్చినా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరు

రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రస్తుతం కళాశాలలో సీటు వచ్చినా ఫీజు రియాంబర్స్ మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన వంతుగా ఈ ఏడాది 28 మంది విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేశానని వివరించారు. అలాగే రూ. 378 కోట్లతో రీ టెండర్ వేయించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించానన్నారు. నల్గొండలో వెంకటేశ్వర కాలనీలో 100 కోట్ల స్థలంలో పార్టీ ఆఫీస్ కట్టారని చెప్పారు. గుడి ఉన్న చోట పార్టీ ఆఫీస్ కట్టారని.. అయితే తాను ఎమ్మెల్యే అయ్యాక పార్టీ ఆఫీస్ మార్పిస్తానని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.