
తమిళ స్టార్ నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తోన్న సినిమా రాయన్. తమిళ స్టార్ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాను జూలై 26న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు, దర్శకుడు ధనుశ్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
టాలీవుడ్లో తన ఫేవరెట్ హీరో ఎవరు అని అడగ్గా తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ‘ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్’ అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు? సూపర్ స్టార్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని అడగ్గా జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు ధనుశ్.
మరోవైపు ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. హీరో ఓ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన సాధారణ వ్యక్తిలా మద్రాస్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. గతానికి సంబంధించిన పగతో రగిలిపోతుంటాడు. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి పగ ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్‌లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ధనుశ్. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.