ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

ప్రతి ఎలక్షన్​లోనూ జనం చెబుతున్నది ఇదే

ఇప్పటికే 85 వేల ఉద్యోగాలిచ్చినం : సీఎం

నిరుద్యోగ భృతి ఈ ఏడాది కూడా ఇవ్వం

కరెంట్​, బస్సు చార్జీలు పెంచుతం

రాష్ట్రంలో కరోనా లేదు.. దండం పెట్టి రమ్మన్నా రాదు

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తం

సభలో ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: కేసీఆర్​

సీఎం స్పీచ్​ ప్రారంభంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల అడ్డంకులు

‘గెటవుట్​ ఐ సే..’ అంటూ మండిపడ్డ కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: తాము ఏది చేస్తే అది రైట్​ అని ప్రజలు తమకు చెప్తున్నారని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఇదే సందేశం ఇస్తున్నారని, అదే రీతిలో ముందుకు పోతున్నామని చెప్పారు.  ప్రభుత్వ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంచకతప్పదని.. కరెంట్, బస్సు చార్జీలను ఈ బడ్జెట్​లో  పెంచుతామని ఆయన  ప్రకటించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తన జీవితంలో ఎప్పుడూ అనలేదని, లక్ష ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో మాత్రమే చెప్పానని తెలిపారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాది కూడా ఇవ్వబోమన్నారు. మరిన్ని డబుల్​ బెడ్రూం ఇండ్లను ఈ బడ్జెట్​లో ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా లేదని, దండం పెట్టి రమ్మన్నా అది రాదని, ఒక వేళ వస్తే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా అడ్డుకుంటామని తెలిపారు.  సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దేశానికి బలమైన సందేశమిస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం అసెంబ్లీలో, మండలిలో ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ల కోసం  కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామన్నారు.

చార్జీలు పెరుగుతయ్​

ఆదివారం ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో అవసరం మేరకు కొన్ని చార్జీలు పెరుగుతాయని, ముఖ్యంగా కరెంట్​ చార్జీలు స్వల్పంగా పెంచబోతున్నట్లు  సీఎం కేసీఆర్​ తెలిపారు. గడిచిన ఆరేండ్ల కాలంలో ఒకే ఒక్కసారీ ఆర్టీసీ, కరెంట్ చార్జీలను స్వల్పంగా పెంచామని, మరోసారి పెంచాల్సి వస్తే పెంచుతామన్నారు. దీనిపై ప్రజలకు వివరణ ఇస్తామని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా.. ప్రభుత్వ సంస్థల మనుగడ కోసం పెంచుతామన్నారు. పార్లమెంటరీ ప్రజస్వామ్యంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్స్​లతోనే ప్రభుత్వాలు నడుస్తాయని, అవసరమైన మేరకు చార్జీలు పెంచక తప్పదని  పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న 24 గంటల కరెంట్​ సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరోనా లేదు

రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని సీఎం తెలిపారు. మాస్కులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అసెంబ్లీలో ఉన్నవాళ్లు ఎవరైనా మాస్కులు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యమంత్రి ఈటలకు కూడా మాస్క్ లేదన్నారు. అసలు రాష్ట్రానికి కరోనా రాలేదని.. అసలు అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదని పేర్కొన్నారు. ‘‘కరోనా మన రాష్ట్రంలో రానేలేదు. దీనిపై అపోహలు, దుష్ప్రచారాలు అవసరం లేదు. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు. అది రావొద్దనే దేవుడ్ని కోరుతున్న. నాకు మొన్న ఓ సైంటిస్టు ఫోన్​ చేసిండు. కరోనాకు హైరానా పడాల్సిన అవసరమేమీ లేదని, జ్వరం వస్తే వేసుకునే పారాసిటమల్​ వేసుకుంటే సరిపోతది సర్​ అని చెప్పిండు. మన తెలంగాణకైతే అసలే రాదని చెప్పిండు. 22 డిగ్రీల టెంపరేచర్​ దాటితే కరోనా వైరస్​ ఫైర్​ అయిపోతుందని అన్నడు. మన దగ్గర ఇప్పటికే 30 డిగ్రీల టెంపరేచర్​ దాటిందని, ఈ పరిస్థితిలో అది రమ్మని దండం పెట్టినా రాదని అన్నడు. ఇప్పటి వరకైతే తెలంగాణలో రాలే’’ అని సీఎం వివరించారు.

ఒక్కడెవ్వడో దరిద్రుడు మన దగ్గరికి వచ్చిండు

అసలు కరోనా మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదని, ఎక్కడో చైనా దేశంలో పుట్టిందని, ఇక్కడి నుంచి వెళ్లి విమానాల్లో, ఓడల్లో ప్రయాణాలు చేస్తున్నరు కాబట్టి అది వస్తోందని సీఎం తెలిపారు. దేశం మొత్తం మీద ఉన్న 130 కోట్ల జనాభాలో 31 మందికే ఇది వచ్చిందని చెప్పారు. అందులో ఒక్కడెవ్వడో సన్నాసి, దరిద్రుడు మన దగ్గరికి వచ్చాడని సీఎం వ్యాఖ్యానించారు. అతడు కూడా డైరెక్ట్​ మన దగ్గరికి రాలేదని, చైనాకెళ్లి దుబాయ్​కు పోయిండని, అక్కడి నుంచి బెంగళూర్​కు వెళ్లి హైదరాబాద్​కు వచ్చిండని తెలిపారు. హైదరాబాద్​కు అతడు రాంగనే ఈటల రాజేందర్​ దొరకబట్టి గాంధీ ఆస్పత్రిలో వేసిండని సీఎం పేర్కొన్నారు.  ట్రీట్​మెంట్​ ఇస్తున్నారని, అతడు చనిపోయే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు సింగిల్​ మనిషికి కూడా కరోనా రాలేదని, దబ్బున వస్తే ఎదుర్కొంటామని, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా అడ్డుకుంటామన్నారు. అవసరమైతే స్పీకర్​ పర్మిషన్​తో అసెంబ్లీని బంద్​ చేసి ఎవరి నియోజకవర్గంలో వాళ్లం నిలబడి మాస్కులు లేకుండా పని చేస్తామని సీఎం చెప్పారు.

ఏది పడితే అది మాట్లాడకూడదు

శాసనసభలో ఏది పడితే అది మాట్లాడకూడదనే నియమం పెట్టాలని, పనిచేసే ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తే ఊరుకోకూడదని సీఎం కేసీఆర్​ అన్నారు. దీనిని నివారించేందుకు సింగపూర్​ తరహా చట్టాలను తీసుకురావాల్సిన విషయాన్ని సభ పరిశీలించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు టీఆర్​ఎస్​లో చేరడంపై కేసీఆర్‌‌‌‌ మాట్లాడుతూ.. 120 స్థానాలకు గానూ అసెంబ్లీలో తమకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో కలిసి పనిచేస్తామని వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాకను తాను నిరాకరించనని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించామని తెలిపారు. చట్టబద్ధంగా రెండింట మూడొంతుల మంది తీర్మానం చేసుకుని వస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఆ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వచ్చి చట్టబద్ధంగా విలీనమయ్యారని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీ అయినా చీలి వస్తే వద్దని చెప్తారా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఏర్పాటు నుంచి కుట్రలే

రాష్ట్ర ఏర్పాటు నుంచి కుట్రలు చేస్తున్నారని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్ట్‌‌‌‌ దక్కకుండా చేసిందన్నారు. అభివృద్ధికి సహకరించకుండా ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.  పబ్లిక్  లైఫ్ లో ఉండడమే అధికారంలో ఉన్నట్లు లెక్క అని సీఎం అన్నారు. అధికార పార్టీగా ఉన్నమా, వేరే ఉన్నమా అని కాదని పేర్కొన్నారు. సర్కారులో ఉండే పాత్ర అయితే  సర్కారు పాత్ర చేస్తామని, అపొజిషన్ లో ఉండే పాత్ర వస్తే అపొజిషన్ పాత్ర చేస్తామని తెలిపారు.

పసుపును మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ద్వారా కొంటం

నిజామాబాద్‌‌‌‌, జగిత్యాల, నిర్మల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో పసుపు పంట 1.50లక్షల ఎకరాల్లో సాగవుతోందని సీఎం తెలిపారు. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించి మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలను ప్రోత్సహించి కల్తీ లేకుండా పసుపు, కారం తదితర ఉత్పత్తులను తెలంగాణ బ్రాండ్‌‌‌‌ ఉత్పత్తులుగా తీసుకువస్తామన్నారు. రైతులకు ఇచ్చే వడ్డీ లేని రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాల్లో ఎలాంటి కోతలు ఉండవని, ఈ పథకాలను కొనసాగిస్తామన్నారు.  ‘‘2004 నుంచి 2014 వరకు తెలంగాణలో క్యాపిటల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పెండేచర్‌‌‌‌ రూ. 59 వేల కోట్లు. గత ఐదేండ్లలో టీఆర్ఎస్​ ప్రభుత్వం పెట్టిన క్యాపిటల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పెండేచర్‌‌‌‌ రూ.1.60 లక్షల కోట్లు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో 38.19 లక్షల ఎకరాల వరి సాగైంది. వర్షకాలంలో 40 లక్షల ఎకరాలకుపైగా వరి సాగైంది’’ అని కేసీఆర్‌‌‌‌ తెలిపారు. పండించే వడ్లన్నీ ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.  పోడు భూములకు రైతుబంధు పథకం వర్తించదని, కాని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. గతంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు.

ఢిల్లీ తరహా స్కూళ్లు అభివృద్ధి చేస్తం

రాష్ట్రంలో ఢిల్లీ తరహాలో పాఠశాలల అభివృద్ధి కోసం కృషిచేస్తానని సీఎం చెప్పారు.  ఢిల్లీలో కేవలం 5,500 స్కూళ్లు ఉన్నాయని, మన రాష్ట్రంలో 30వేల స్కూళ్లు  ఉన్నాయని తెలిపారు. అన్నింటినీ ఒకే సారి  ఢిల్లీ తరహాలో చేయడం కుదరదని, అంచెల వారీగాచేస్తామని చెప్పారు. ఇంగ్లిష్‌‌‌‌ మీడియం స్కూళ్లు, విద్యావిధానంపై ప్రత్యేక వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ నిర్వహించి విద్యావంతుల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల   ఫీజులను కట్టడి చేస్తామని తెలిపారు. యూనివర్సిటీలకు త్వరలోనే వీసీలను  నియమిస్తామని ప్రకటించారు. ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.

నా బర్త్​ సర్టిఫికెట్‌కే దిక్కులేదు.. మా నాయనది యాడికెల్లి తేవాలి

నేను మా సొంతూర్లో పుట్టిన. అప్పట్లో దవాఖానాలు లేవు. నాకే బర్త్​ సర్టిఫికెట్​ లేదు. నువ్వు ఎవలు అని అడిగితే నేనేం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూవ్​? ఆ కాలంలో అయ్యగార్లను పిలిపించి జన్మనామం అని రాయించేటోళ్లు. అది కూడా అఫీషియల్​ కాదు. ఇప్పటికి కూడా నా జన్మనామం మా వైఫ్ దగ్గర ఉంది. నా బర్త్​ సర్టిఫికెట్​కే దిక్కులేదంటే మీ నాయనది తీసుకురమ్మంటే యాడికెల్లి తేవాలి ? నేను చావాల్నా? మాకు 580 ఎకరాల జాగా, పెద్ద బిల్డింగ్ ఉండె. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేదలైన ప్రజలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి?

రాష్ట్రంలో కరోనా లేదు.. రానివ్వం

రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. అసెంబ్లీలో ఉన్నవాళ్లు ఎవరైనా మాస్కులు పెట్టుకున్నరా?. ఆరోగ్యమంత్రి ఈటలకు కూడా మాస్క్ లేదు. అసలు రాష్ట్రానికి కరోనా రాలేదు. అసలు అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు. కరోనాపై అపోహలు, దుష్ప్రచారాలు అవసరం లేదు. అది రావొద్దనే దేవుడ్ని కోరుతున్న. నాకు మొన్న ఓ సైంటిస్టు ఫోన్​ చేసిండు. 22 డిగ్రీల టెంపరేచర్​ దాటితే కరోనా వైరస్​ ఫైర్​ అయిపోతుందని అన్నడు. మన దగ్గర ఇప్పటికే 30 డిగ్రీల టెంపరేచర్​ దాటిందని, ఈ పరిస్థితిలో రమ్మని దండం పెట్టినా
అది రాదని అన్నడు.

‘‘మాకు స్పష్టంగా ప్రజలు సందేశం ఇస్తా ఉన్నారండి. ఎలక్షన్ టు ఎలక్షన్. వాట్ యూ ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ యూ గో అహెడ్ అని చెప్తున్నారు మాకు. ఎవరైనా మాట్లాడితే మీరు పట్టించుకోనక్కర్లేదు… ఉత్తమమైన సలహాలుంటే స్వీకరించండి. అడాప్ట్ చేసుకోండి… మేం తీసుకుంటున్నాం కూడా. ఇంటెన్షనల్ క్రిటిసిజం ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు… బేఖాతరు చేసి ముందుకు పొమ్మని చెప్తున్నారు. అట్లే పోతున్నాం. అట్లే పోతం.’’  – సీఎం కేసీఆర్​

ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు

కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారంటూ సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రశ్నించారు. ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటే.. ప్రైవేట్‌‌‌‌ ఉద్యోగాలు లక్షల్లో ఉన్నయ్. ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామని ఎందుకు చెప్పాలి? ఇంటికో ఉద్యోగం ఇస్తానని నేను నా జీవితంలో  ఎప్పుడూ అనలేదు. అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నరు. ఆ విషయాన్ని మా మేనిఫెస్టోలో పెట్టలేదు. ఉద్యమ సమయంలో మాత్రం.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిన. ఇందులో ఇప్పటికే 85 వేల ఉద్యోగాల వరకు ఇచ్చినం. ఏ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఎన్ని ఇచ్చినమో పూర్తి వివరాలిస్తం. ఒక్క పోలీస్‌‌‌‌ విభాగంలోనే 25వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చినం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 25 వేల మందికి జాబ్స్‌‌‌‌ ఇచ్చినం. పార్టీలు యువతను గందరగోళంలోకి నెట్టేయొద్దు. ఇన్నేండ్లలో మూడు లక్షల ఉద్యోగాలె ఇచ్చిన్రు. 60 ఏండ్లుగా ఎందుకో లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు? హైదరాబాద్‌‌‌‌లో ఐటీ రంగంలో 7 లక్షల మంది పనిచేస్తున్నరు. పరిశ్రమల్లో 10 లక్షల మంది ఉన్నరు’ అని కేసీఆర్‌‌‌‌ పేర్కొన్నారు.

ఉద్యోగుల కష్టాలన్నీ పోవాలి

ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ పోవాలని, దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామని సీఎం  చెప్పారు.  సర్వీస్‌‌‌‌ బుక్‌‌‌‌లో 300 పేజీలు అవసరమా అని ప్రశ్నించారు. వీటన్నింటిని సెట్‌‌‌‌ రైట్‌‌‌‌ చేస్తామని, అందుకే సమయం పడుతోందని చెప్పారు. పీఆర్‌‌‌‌సీ తక్కువ ఇస్తే తక్కువే ఇస్తామని కూడా చెప్తామని వెల్లడించారు. ‘‘సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ అన్ని సెట్‌‌‌‌ రైట్‌‌‌‌ కావాలి.  రిటైర్‌‌‌‌ అయిన ఉద్యోగులు పెన్షన్‌‌‌‌ కోసం ఆఫీసులచుట్టూ తిరగొద్దు. కాంపాసినేట్‌‌‌‌ అపాయింట్‌‌‌‌ మెంట్‌‌‌‌ కోసం తిరగడం ఉండొద్దు. ఇలాంటి సమస్యలన్నీ పోవాలి”అని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో భార్య, భర్తలు ఒకే దగ్గర లేకుండా పనిచేస్తే పిల్లలపై ప్రభావం పడుతుందని సీఎం చెప్పారు. ఒకే దగ్గర పని చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్లాంకెట్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌  ఇస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని డబుల్‌‌‌‌ ఇండ్లు ప్రకటిస్తం

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.76లక్షల డబుల్ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌  ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటికే లక్ష ఇండ్లు 80శాతం నిర్మాణంపూర్తయిందని సీఎం చెప్పారు. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి త్వరలో ఇండ్లను అందజేస్తామని తెలిపారు. కొత్త బడ్జెట్‌‌‌‌లోనూ మరిన్ని ఇండ్లును ప్రకటిస్తామని సీఎం చెప్పారు.

నిరుద్యోగ భృతి ఈ ఏడాది కూడా ఇవ్వం

నిరుద్యోగ భృతి ఈ ఏడాది కూడా ఇవ్వబోమని సీఎం కేసీఆర్​ తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితిని బట్టి అమలు చేస్తామన్నారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం ఉందని, ఇది కఠోరమైన సత్యమని తెలిపారు.

కేంద్రం 3,600 కోట్లు కోత పెట్టింది

గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 19 వేలకోట్లలో రూ.3600 కోట్లు కోత పెట్టారని సీఎం చెప్పారు. పార్లమెంట్‌‌‌‌ తరహాలో అసెంబ్లీ సెక్రటరీకి సీఎస్‌‌‌‌ తరహాలో కేబినెట్‌‌‌‌ హోదా కల్పించేందుకు తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు.

ఖైదీల క్షమాభిక్ష, టెట్​పై సానూకూలం

7ఏండ్ల శిక్షపూర్తి చేసుకున్న ఖైదీలకు గాంధీ 150వ జయంతి సందర్భంగా క్షమాభిక్ష  పెట్టాలని, టెట్‌‌‌‌ పరీక్షపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి సీఎం దృష్టికి తేగా.. దీనికి సీఎం సానూకూలంగా స్పందించారు

82 క్యాంప్​ ఆఫీసులు పూర్తయినయ్​

‘ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణం ఎక్కడా లేదు. ఎమ్మెల్యేలకు ఆ గౌరవం ఉండాలని.. రాష్ట్రవ్యాప్తంగా 104  నియోజకవర్గాలకు కార్యాలయాలను మంజూరు చేసినం. 82 నియోజకవర్గాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. 8 చోట్లనే భూ వివాదాలు ఉన్నయ్​’ అని కేసీఆర్‌‌‌‌ తెలిపారు.