ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌కు ముందు మహ్మద్ సిరాజ్ ఓ అనామకుడు..! కానీ సిరీస్ ముగిసేసరికి.. టీమిండియా హీరోగా మారిపోయాడు..! కెప్టెన్ కోహ్లీతో సహా చాలా మంది స్టార్ ప్లేయర్ల గైర్హాజరీలోనూ.. ఒంటిచేత్తో ప్రతిష్టాత్మక బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని సాధించి పెట్టాడు..! అప్పటివరకు టీమ్‌లోకి వస్తూపోతూ ఉండే ఈ హైదరాబాదీ.. ఆ సిరీస్ తర్వాత ఇండియా రెడ్‌బాల్ క్రికెట్‌లో టాప్ బౌలర్‌గా ఎదిగాడు..! బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేశ్‌లాంటి పేసర్లు.. టీమిండియాను ఏలుతున్న తరుణంలోనూ తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు..! సిరీస్ మధ్యలో తండ్రిని కోల్పోయినా.. దేశం కోసమే స్వేదం చిందించిన ఈ భాగ్యనగరం కుర్రాడు.. వజ్రంలా మెరవడానికి కారణం ఎవరు..? సింగిల్ సిరీస్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగిన 27 ఏళ్ల యంగ్‌స్టర్ వెనుక మంత్రందండలా పని చేసిన ఆ వ్యక్తి ఎవరు..? ఈ ప్రశ్నకు సిరాజ్ ఏం జవాబు చెబుతున్నాడో చూద్దాం..!!
న్యూఢిల్లీ: ఓవైపు తండ్రి లేడన్న బాధ.. మరోవైపు దేశం ఓడుతుందనే ఆవేదన.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయం.. యావత్ ఇండియాను ఊపేసింది. నిర్ణయం తీసుకోవడమే కాదు.. తన బౌలింగ్ నైపుణ్యంతో ఏకంగా సిరీస్‌ను సాధించిపెట్టి.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఓ పేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఓ సాధారణ క్రికెటర్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా తాను ఎదగడం వెనుక కెప్టెన్ విరాట్ కోహ్లీ హస్తం ఉందని చెబుతున్నాడు. అతనిచ్చిన సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైందన్నాడు. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో సిరాజ్.. తన కెరీర్ గురించి పలు అంశాలు వెల్లడించాడు. అవి అతని మాటల్లోనే..
ఈ కెరీర్ విరాట్ దయే..
నేను క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోజు నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్‌లో వందశాతం కష్టపడేందుకు ప్రయత్నిస్తా. ఎన్ని రకాల అడ్డంకులు ఎదురైనా టీమ్‌ను గెలిపించామా లేదా అన్నదే ముఖ్యం. దీనికోసం ఎంతవరకైనా వెళ్తా. స్టార్టింగ్‌లో నా కెరీర్ పడుతూ లేస్తూ సాగింది. కానీ విరాట్ భయ్యా దృష్టిలో పడిన తర్వాత వేగంగా మారిపోయింది. బౌలింగ్‌పై దృష్టిపెట్టడంతో పాటు ఫిట్‌నెస్‌ను పెంచుకున్నా. అదే నాకు వరంగా మారింది. ఏ విషయంలోనైనా కోహ్లీ నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఏ వికెట్ మీదనైనా నీవు బౌలింగ్ చేయగలవు. ఎంతటి బ్యాట్స్‌మెన్‌నైనా ఔట్ చేసే సత్తా నీకు ఉందని నన్ను బాగా ప్రోత్సహిస్తాడు. మొన్న ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా నాతో మాట్లాడాడు. ఇంగ్లండ్ టూర్‌కు రెడీగా ఉండాలని అప్పుడే చెప్పాడు. నా బౌలింగ్‌లో వేరియేషన్స్ బాగున్నాయని మెచ్చుకున్నాడు. అది కంటిన్యూ చేయాలని కూడా సూచించాడు. నువ్వు జట్టుకు ప్లస్ అవుతున్నావు. ఇలాగే కష్టపడు.. అని వరల్డ్ బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన విరాట్ మెచ్చుకుంటే అంతకంటే మనకు ఏం కావాలి. ఈ మాటలు విరాట్ నోటి నుంచి రావడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలు నన్ను మరింత మోటివేట్ చేశాయి.
నమ్మకం కోల్పోలేదు..
ఇంటర్నేషనల్ లెవెల్లో సిరాజ్ ఇప్పటివరకు 5 టెస్ట్‌లు, 1 వన్డే, 3 టీ20లు మాత్రమే ఆడాడు. కానీ అంతకంటే ఎక్కువగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడటంతో విరాట్‌తో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. నిజం చెప్పాలంటే నేను లాస్ట్ రెండు ఐపీఎల్ సీజన్లలో పెద్దగా పెర్ఫామెన్స్ చేయలేదు. అయినా విరాట్ భయ్యా మాత్రం నాపై నమ్మకం కోల్పోలేదు. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. వికెట్లు తీయకపోయినా.. బౌలింగ్ ఇస్తూ ప్రోత్సహించాడు. ఎక్కువగా చాన్స్ ఇవ్వడంతో గాడిలో పడేందుకు నాకు మరింత టైమ్ లభించింది. దీనివల్లే ఐపీఎల్‌లోనూ సక్సెస్ అయ్యా. నా కెరీర్ మొత్తం అతనికి రుణపడి ఉంటా. స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్ కూడా నాకు మేలు చేసింది. ఇప్పుడు నేను రెండో ఫారిన్ టూర్ ఆడబోతున్నా. అక్కడ కూడా నా శక్తి మేరకు టీమ్‌ను గెలిపించేందుకే ప్రయత్నిస్తా.
నన్ను హగ్ చేసుకున్నాడు..
నేను ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు నా తండ్రి మరణించాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా విరాట్, కోచ్ రవిశాస్త్రి ఈ విషయం నాతో చెప్పారు. తొలిసారి ఇండియాకు ఆడుతున్నందుకు ఆనందపడాలో, తండ్రిని కోల్పోయినందుకు బాధపడాలో అర్థం కాలేదు. బాధ తట్టుకోలేక వెంటనే హోటల్ రూమ్‌కు వెళ్లిపోయా. మ్యాచ్ ఆడటాన్ని పక్కనబెడితే నా ఆలోచనలు కూడా నా ఆధీనంలో లేవు. అసలు ఏం చేయాలో కూడా తేల్చుకోలేని పరిస్థితి. ఆ టైమ్‌లో విరాట్ భయ్యా ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరవలేను. ఆ సమయంలో నాకు చాలా దగ్గరగా ఉన్నాడు. నన్ను గట్టిగా హగ్ చేసుకుని.. బాధపడకు నీకు నేనున్నా అంటూ ఓదార్చాడు. నేను ఏడుస్తున్నప్పుడు అతను చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నాలో స్ఫూర్తిని నింపాయి. ఆ సిరీస్‌లో విరాట్ ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు. కానీ అతను నింపిన ఆత్మవిశ్వాసం నాకు సిరీస్ మొత్తం పని చేసింది. గ్రౌండ్‌లోనూ మంచి ఫలితాన్నిచ్చింది. దాని రిజల్టే.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ. విరాట్‌కు ఇండియాకు వచ్చేసినా నాతో రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడేవాడు. నా జీవితంలో కూడా కోహ్లీ నాకు అండగా నిలిచాడు. ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన సిరాజ్.. మూడు టెస్ట్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూడా తీశాడు. సిరీస్ ముగిసేసరికి ఇండియా తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి 2–1తో సిరీస్ గెలిపించాడు. కంగారూల గడ్డపై సిరీస్ గెలవడం నా తండ్రికి నేను ఇచ్చిన గొప్ప నివాళి అది. ఆ సిరీస్ మొత్తం మా కోచ్ శాస్త్రి ఇచ్చిన మద్దతు మరవలేనిది. చాంపియన్ బౌలర్ అని పిలుస్తూ నన్ను ప్రోత్సహించేవారు. వెన్నుపై బలంగా తడుతూ నన్ను ఎంకరేజ్ చేసేవారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న నేను డిప్రెషన్‌లోకి వెళ్లకుండా నెట్ సెషన్స్‌లో నాపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేవారు. ఎక్కువ సేపు బౌలింగ్ చేయించడంతో.. ఇతర విషయాలు గుర్తుకు రాకుండా చూసేవారు. అది నాకు చాలా ప్లస్ అయ్యింది. ఇంత పెద్ద వయసులోనూ రవి సార్.. చాలా ఎనర్జిటిక్‌గా ఉండటం చాలా గొప్ప విషయం. మేమందరం ఆదర్శంగా తీసుకోవాల్సిందే.
