
ముంబై: ఐపీఎల్ పద్నాలుగో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది. వరుస విజయాలతో కప్ మీద కన్నేసింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచి ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపుతోంది. ఆర్‌సీబీపై సీనియర్ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ స్పీడ్‌స్టర్ ఆశిష్ నెహ్రా కూడా ఆర్సీబీ ఆటను మెచ్చుకున్నాడు. భయం లేకుండా ఆడుతున్న ఆర్‌సీబీ.. పాయింట్లను మరింతగా పెంచుకుంటూ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
‘ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లి దేన్నీ తేలికగా తీసుకోడు. ఈ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో నాలుగింట్లోనూ గెలవడం ఆర్‌సీబీ ప్లేయర్ల మనోస్థైర్యాన్ని పెంచుతుంది. వాళ్లు హద్దుల్లేకుండా ఆడుతున్నారు. ఇదే ఆటతీరుతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడంపై విరాట్ సేన దృష్టిపెట్టాలి. ఆ తర్వాత టీమ్‌లో అవసరమైన ప్రయోగాలు చేసుకోవచ్చు. విరాట్, డివిలియర్స్‌ను మినహాయిస్తే.. దేవ్‌దత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, చాహల్, వాషింగ్టన్ సుందర్ లాంటి యంగ్ ఆటగాళ్లు రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మెయిన్ టీమ్‌లో వీరిని కొనసాగించాలి. గత ఎడిషన్లతో పోల్చితే ఈసారి ట్రోఫీ వేటలో ఆర్‌సీబీ ముందుంది. సీజన్‌ను మొదలుపెట్టిన ఊపును కొనసాగిస్తే ఆర్‌సీబీదే టైటిల్’ అని నెహ్రా అంచనా వేశాడు.