
న్యూఢిల్లీ: ఇండియా బాక్సింగ్ లెజెండ్ ఎంసీ మేరీకోమ్ తన భర్త కరుంగ్ ఓంఖోలర్ (ఓన్లర్)తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 20వ తేదీనే చట్టప్రకారం కుటుంబ సభ్యులు, కుల పెద్దల సమక్షంలో తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకున్నామని బుధవారం వెల్లడించింది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు, పుకార్లపైనా మేరీ స్పందించింది.
తన బాక్సింగ్ ఫౌండేషన్ చైర్మన్, బిజినెస్ పార్ట్‌నర్ హితేశ్ చౌదరి, మరో బాక్సర్ భర్తతో తనకు సంబంధం ఉందన్న పుకార్లపై తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ పూర్తిగా తప్పుడు, నిరాధార వార్తలేనని తేల్చి చెబుతూ తన లాయర్‌తో లీగల్ నోటీసులు కూడా జారీ చేయించింది. వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. తన విషయంలో తప్పుదోవ పట్టించే పుకార్లు, సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
తన వ్యక్తిగత జీవితం గత రెండేండ్లుగా చాలా కష్టంగా సాగిందన్న మేరీ తన ప్రైవసీని కాపాడాలంటూ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, మీడియా, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.ఈ విషయంపై మణిపూర్‌లో ఇప్పటికే ఒక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వివరణ ఇచ్చినట్లు తెలిపిన మేరీ లీగల్ నోటీసు చివరి క్లారిఫికేషన్ అని మేరీ స్పష్టం చేసింది.