పన్ను కట్టలేదని జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఫౌండర్‌‌కు నోటీసులు

పన్ను కట్టలేదని జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఫౌండర్‌‌కు నోటీసులు
  • విచారణకు రావాలని నరేష్ గోయల్ కు ఐటీశాఖ ఆదేశం
  • రూ.650 కోట్లు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల వల్ల కొన్ని నెలల క్రితం మూతబడ్డ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఫౌండర్‌‌ నరేశ్‌‌ గోయల్‌‌కు మరో చిక్కు వచ్చిపడింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీశాఖ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. జెట్‌‌లో ఆర్థిక అక్రమాలకు సంబంధించి గోయల్‌‌కు నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఐటీ దర్యాప్తు విబాగం గత సెప్టెంబరులో ముంబైలోని జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఆఫీసులో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో విచారణ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తయింది. విచారణ నివేదికను ఐటీ అసెస్‌‌మెంట్‌‌ వింగ్‌‌కు పంపించారు. జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌, దుబాయిలోని దీని అనుబంధ సంస్థల మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రూ.650 కోట్ల విలువైన పన్నులను ఎగ్గొట్టడానికే దుబాయి కంపెనీలను ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. దుబాయిలోని తన జనరల్‌‌ సేల్స్ ఏజెంట్‌‌కు జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఏటా కమీషన్లు చెల్లిస్తున్నట్టు గ్రహించారు. ఈ ఏజెంట్ కూడా గ్రూప్‌‌ యూనిట్‌‌లో భాగమని నిర్ధారించారు. ఐటీ చట్టం అనుమతించినదానికంటే ఈ చెల్లింపులు చాలా ఎక్కువని, వీటిని ఖర్చులుగా భావించడం సాధ్యం కాదని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. విదేశాల నుంచి నిధులను మళ్లించి పన్నులను ఎగ్గొట్టడానికే ఇలా చేశారని తెలిపారు. ఈ లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా గోయల్‌‌ను ఆదేశించామని వెల్లడించారు. దీనిపై స్పందించడానికి జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ తిరస్కరించింది. దుబాయి కంపెనీ ఏజెంట్‌‌కు చెల్లింపుల విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించామని ఇది గతంలో వివరణ ఇచ్చింది.

ఎంసీఏ కూడా..

జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌, దీని పాత బోర్డులో వ్యవహారాలపై ఐటీతోపాటు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) కూడా కన్నేసింది. సంస్థలో జరిగిన చాలా లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎంసీఏ నిర్ధారించింది. వీటిపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఖాతా పుస్తకాలను తనిఖీ చేశాకే ఈ నిర్ణయానికి వచ్చింది. ఎంసీఏ అధీనంలో సీరియస్ ఫ్రాడ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీస్‌‌ (ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ)కు విచారణ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఎంసీఏ సూచన మేరకు దర్యాప్తు సంస్థల అధికారులు గోయల్‌‌ దంపతులపై లుకౌట్‌‌ నోటీసు జారీ చేశారు. విచారణ నుంచి తప్పించుకోవడానికి వీళ్లు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గోయల్‌‌ దంపతులు గత నెల 25న ముంబై నుంచి దుబాయి వెళ్తుండగా, ఎయిర్‌‌పోర్టులోనే అడ్డుకున్నారు. ఈడీ కూడా జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ విదేశీ పెట్టుబడుల గురించి కంపెనీ సీనియర్ అధికారులను ప్రశ్నించింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో మూతబడ్డ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌కు వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో వాటాలను అమ్మి అప్పులను వసూలు చేసుకుందామన్న ఎస్‌‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం ఆలోచనలు అమలు కావడం లేదు. ఆస్తుల అమ్మకానికి నిర్వహించిన బిడ్డింగ్​కు స్పందన రాలేదు.  జెట్​ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం పతనమయింది. దీనిని ఎఫ్​ అండ్​ ఓ విభాగం నుంచి తొలగిస్తున్నట్టు స్టాక్​ ఎక్సేంజీలు ప్రకటించాయి.

‘ సమస్య పరిష్కారమవుతుంది’

జెట్‌‌ మూసివేతపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని భావిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌‌ పురి శుక్రవారం అన్నారు. విమానయాన రంగానికి సంబంధించి గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమని, వాటిని సరిదిద్దుతామని తెలిపారు.  రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌ 17 నుంచి జెట్‌‌ను మూసివేశారు. వందల మంది ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. విమానాలు కూడా ఒక్కొక్కటిగా డీరిజిస్టర్‌‌ అవుతున్నాయి. ఈ కంపెనీకి రూ.8,400 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. వీటిని రాబట్టుకోవడానికి బ్యాంకులు జెట్‌‌ వాటాలను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఎతిహాద్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ సహా కొన్ని కంపెనీలు ఆసక్తిని వ్యక్తీకరించడంతో బిడ్స్‌‌ వేసేందుకు అనుమతించారు.  వీటితోపాటు లండన్‌‌కు చెందిన అది గ్రూప్‌‌, జెట్‌‌ మాజీ ఉద్యోగుల సంఘం, బ్రిటిష్‌‌ వ్యాపారి జేసన్‌‌ అన్‌‌స్వర్త్‌‌ జెట్‌‌లో వాటాలు కొనడానికి ముందుకు వచ్చారు. ఇందుకు ఎస్‌‌బీఐ స్పందిస్తూ మొదట బిడ్లు వేసిన వారికే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. అయితే ఎతిహాద్‌‌ మినహా ఫైనల్‌‌ బిడ్‌‌ వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తాము పరిమిత వాటా మాత్రమే కొంటామని  తెలిపింది. దీంతో జెట్‌‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ కంపెనీని ప్రభుత్వమే రక్షించాలని జెట్ ఎయిర్‌‌వేస్‌‌ ఉద్యోగులు కోరుతున్నారు.