నేను హిందువుని.. గుడికి వెళ్తే తప్పేంటి

నేను హిందువుని.. గుడికి వెళ్తే తప్పేంటి

తనపై వచ్చిన సాఫ్ట్ హిందుత్వ ఆరోపణలను ఖండించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. తాను హిందువునని... ఆలయాలకు వెళ్తానని... అందులో తప్పేముందని ప్రశ్నించారు. తాను ఆలయాలకు వెళ్తే వారికొచ్చిన ఇబ్బంది ఏంటో తనకు తెలియడంలేదన్నారు. ఆదివారం గోవాలో పర్యటించిన కేజ్రీవాల్ ఆలయాల దర్శించుకునే విషయంలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  గోవాలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో పాగ వేయడం కోసం కేజ్రీవాల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రెండురోజుల పాటు పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ పలు ఆలయాలు సందర్శించారు. దీంతో పాటు.. రాజకీయంగా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘మీరు ఆలయాలకు వెళ్లడం లేదా? గుడికి వెళ్తే తప్పేంటి.. నేను హిందువుని... రామాలయంను, హనుమాన్ ఆలయాలకు నేను వెళ్లాను. దీంతో ఎవరికైనా ఏం సమస్య వచ్చింది? ఎందుకు ఈ విషయంలో నాపై ఆరోపణలు చేస్తున్నారు? అంటూ కేజ్రీవాల్ అన్నట్లుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. 

మరోవైపు కేజ్రీవాల్ సర్కార్‌పై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక విమర్శలు చేశారు.ఆప్ తన ప్రభుత్వ పథకాల్ని కాపీ చేస్తుందని ఆరోపించారు. భక్తుల కోసం మేం  తీసుకొచ్చిన పథకాలు అరవింద్ కేజ్రీవాల్ కాపీ కొట్టారన్నారు. అయితే సీఎం సావంత్ వ్యాఖ్యల్ని బలంగా తిప్పికొట్టారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వాస్తవానికి గోవాలో సావంత్ పార్టీయే తమ ప్రభుత్వ పథకాల్ని కాపీ చేస్తుందన్నారు. మేం విద్యుత్ ఉచితం అని ప్రకటించగానే... సావంత్ వాటర్ ఫ్రీ అంటూ స్కీం ప్రకటించారన్నారు. మేం ఉద్యోగులకు అలవెన్స్ ప్రకటించగానే.. అప్పుడు సీఎం ప్రమోద్ సావంత్ 10వేల ఉద్యోగాలను ప్రకటించారు. నేను భక్తుల గురించి మాట్లాడినప్పుడే ఆయన దీనికి సంబంధించిన పథకాన్ని వెల్లడించారు’ అని కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. 

సీఎం కేజ్రీవాల్ నవంబర్ 1న వివిధ మతాలకు చెందిన భక్తుల యాత్రల కోసం కొత్త స్కీంను ప్రకటించారు. గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు ఉచితంగా యాత్రలు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అయోధ్యలోని రామాలయంని కూడా ఆయన తన స్కీంలో చేర్చారు. గతనెలలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీ లీడర్లు అయోధ్య రామాలయం కాంప్లెక్స్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.