ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

పనాజీ : తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. తనను గుండెల్లో పెట్టుకుని అభిమానించిన తెలుగు వారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని చిరంజీవి అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు దాసుడినని చెప్పారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘‘ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ’’ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇవాళ జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలకు చిరంజీవి దంపతులు హాజరయ్యారు.

అవార్డును అందుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ప్రేక్షకులు తన పట్ల చూపుతున్న ఆదరాభిమానాలను జీవితాంతం కాపాడుకుంటానని చిరంజీవి అన్నారు. మధ్య తరగతి కుటుంబంలో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గా జన్మించిన తనకు సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చిందన్నారు. దాదాపు 4 దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఉన్న తనకు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా రంగం విలువ ఏంటో అర్థమైందన్నారు. 

ఈ క్షణం కోసమే చాలా కాలం నుంచి ఎదురు చూశా

భారతీయ చిత్రోత్సవాలు ఎన్నో చూశానని.. ఒక్క దక్షిణాది నటుడి ఫోటో కూడా లేకపోవడం చాలా బాధ కలిగించిందని.. అయితే ఇప్పుడు తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. కొద్ది గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలో రీ ఎంట్రీకి సిద్ధమైనప్పుడు భయమేసిందన్నారు. ఏ రంగంలోనైనా అవినీతి కనిపించొచ్చు కానీ.. అవినీతిలేని ఏకైక రంగం సినీ రంగం అని చిరంజీవి పేర్కొన్నారు. సినీ రంగంలో టాలెంట్ ఉంటేనే ఎదుగుతామని.. టాలెంట్ లేకపోతే ఎదగలేమని చెప్పారు.