టీఆర్ఎస్ నుంచి మళ్లీ నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తది. నేనే గెలుస్తా

టీఆర్ఎస్ నుంచి మళ్లీ నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తది. నేనే గెలుస్తా
  • ఎలాంటి ఆందోళన వద్దు.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి అర్బన్, వెలుగు: ‘టీఆర్ఎస్ నుంచి మళ్లీ నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తది. నేనే గెలుస్తా. సీటు విషయంలో కొందరు ఏవేవో రాస్తున్నరు. ఎవరు ఎటువంటి భ్రమలకు పోవద్దు. నా గెలుపునకు సహకరించాలె’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ అనుమతులు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.168 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే భూపాలపల్లికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ ఉందని, ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి నేడు అభివృద్ధి చెందుతున్న పట్టణాలతో పోటీపడుతోందన్నారు. రూ.80కోట్లతో చెల్పూర్ నుంచి బాంబుల గడ్డ వరకు రోడ్డు వెడల్పు, సైడ్ డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన కొత్త పెన్షన్ ద్వారా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో దాదాపు 10వేల మంది లబ్ధి పొందుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ హరిబాబు, పీఏసీఎస్​ చైర్మన్ మేకల సంపత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రంగా కోటంచ..

రేగొండ, వెలుగు: కోటంచ లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇటీవల ఆలయ కొత్త చైర్ పర్సన్​గా ఎన్నికైన మాదాడి అనిత ఆదివారం ప్రమాణస్వీకారం చేయగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయాభివృద్ధికి అధిన నిధులు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.