- ఫోన్ ట్యాపింగ్‌లో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నరు
- బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, వెలుగు : ఫోన్ ట్యాపింగ్‌లో ఇరికించి తనను జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జైలుకైనా పోతాను కానీ పార్టీ మాత్రం మారబోనని స్పష్టం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో శనివారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. గతంలో రైతుల కోసం కొట్లాడి మూడు సార్లు లాఠీ దెబ్బలు తిని, జైలుకు పోయానని గుర్తు చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరి క్వింటాల్‌కు రూ. 500 బోనస్, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం పార్టీలు మారిన, నాలుగు సార్లు ఓడిన కడియం శ్రీహరి తనను విమర్శించడం సిగ్గు చేటన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లేది లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచే టీఆర్‌ఎస్ క్యాండిడేట్‌గా బరిలో ఉంటానన్నారు.