నా కేసు ఇంకా కోర్టులోనే ఉంది.. రాజీనామా చేయను : గోపీనాథ్ రవీంద్రన్

నా కేసు ఇంకా కోర్టులోనే ఉంది.. రాజీనామా చేయను : గోపీనాథ్ రవీంద్రన్

కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానే తప్ప రాజీనామా చేయనని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పష్టం చేశారు. వీసీ రాజీనామా అనేది అతని ఆర్థిక అవకతవకలు, చెడు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, కానీ ఇక్కడ అలాంటి ఘటనలేమీ జరగలేదని చెప్పారు. తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణ అన్నారు. అంతే కాదు.. కన్నూర్ వీసీగా తన నియామకానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లోనే రవీంద్రన్ చెప్పారు. కోర్టులో కేసు ఉన్నపుడు వీసీ పదవి నుంచి ఛాన్స్ లర్ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

అక్టోబరు 24వ తేదీ ఉదయం 11:30 గంటలలోపు రాజీనామాను సమర్పించాలని కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఆదేశిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇటీవలే ఒక లేఖ జారీ చేశారు. ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్క్రిట్, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, థంచాత్ ఎజుతాచన్ మలయాళం యూనివర్సిటీలు ఉన్నాయి. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ లేఖను సంబంధిత వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లు, పీఆర్‌ఓలకు ఇమెయిల్ పంపారు. ఈ క్రమంలోనే తాను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు నా రాజీనామా లేఖను సమర్పించాలని చెప్పినట్టు రవీంద్రన్ తెలిపారు. అయితే తన కేసు సుప్రీంకోర్టులో ఉంది..కావున రాజీనామా చేసే ఆలోచన లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒకవేళ తన పదవిని రద్దు చేయాలని భావిస్తే చేయండని రవీంద్రన్ అన్నారు.