
అమరావతి, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు రెడీగా ఉందని, ఏపీలో సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ సిద్ధాంతాల్లేని పార్టీగా మారిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత కరువైందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామంటే ఢిల్లీ పెద్దలతో తానే మాట్లాడతానని చెప్పారు. చంద్రబాబు పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి ఆ పార్టీలో ఏముందని ఆయన ప్రశ్నించారు. శనివారం విజయవాడలో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు.
టీడీపీ లాంటి ఓడిపోయిన పార్టీల నుంచి నాయకులు తమ పార్టీలో చేరితే పార్టీ బలపడదన్నారు. రాజకీయ భవిష్యత్తు, అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు తమ పార్టీలో చేరాలనుకుంటే భంగపాటు తప్పదన్నారు. కష్టపడి పనిచేసే వారికే బీజేపీలో గుర్తింపు ఉంటుందని, అవినీతి కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సుజనా చౌదరి టీడీపీ నుంచి బీజేపీలో చేరినంత మాత్రాన మినహాయింపు ఉండదన్నారు. అందరిలాగే సుజనాచౌదరి కూడా బ్యాంకు రుణాలను కట్టాల్సిందేనని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం చూపిన శ్రద్ధ కూడా చంద్రబాబు ప్రభుత్వం చూపలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుని రూ. 2,209 కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు.