
మెదక్, వెలుగు: టీఆర్ఎస్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆదివారం మెదక్ ఆర్అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన ఎంతోమంది ఉద్యమకారులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు అపాయింట్మెంట్దొరకక అవమానానికి గురయ్యారన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ ఉద్యమకారులను గౌరవించడం లేదన్నారు. అగ్రవర్ణాలకు చెందిన లీడర్లను అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులిచ్చారని ప్రశ్నించారు.
బీసీ లీడర్లు చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నారని, రామాయంపేట మండలం కొనాపూర్ సొసైటీలో తప్పుచేసిన అగ్రవర్ణ లీడర్ ను ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో అంతర్గతంగా మాట్లాడనీయరని, బహిరంగంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే గా మదన్ రెడ్డిని గెలిపిస్తే బీసీ నాయకుడైన తనకు మంచి పొజిషన్ ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఆయన మాట తప్పారన్నారు. 2009లో మెదక్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే పద్మా దేవేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విషయం మరిచిపోయినట్టున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పద్మాదేవేందర్ రెడ్డికి టికెట్ వస్తదన్న గ్యారంటీ లేదన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానన్నారు.