
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అయ్యే వాడినని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తన లెవల్ వేరేలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో రిపోర్టర్లతో ఆయన చిట్ చాట్ చేశారు. ‘‘బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే.. రాష్ట్ర హోంమంత్రి నేనే అయితుండే. సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడిని. కొత్త శాటిలైట్ ఛానెల్ పెట్టేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉంది. రేవంత్ నాకు కచ్చితంగా ఆ పదవి ఇవ్వడు. వాళ్లు ఇవ్వకుండా నేను గుంజుకోలేను కదా” అని మల్లారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.
శాసనసభలో తనను ఎవరూ టచ్ చేయడం లేదని, టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానని తెలిపారు. అప్పటి వరకూ తన నోటికి తాళం వేసుకుంటానని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో చేయాల్సినంతా చేశానని, ప్రోటోకాల్ గురించి తాను అడగనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి వస్తానని, లేకుంటే వెళ్లి కాలేజీలో కూర్చుంటానని వెల్లడించారు. తన కాలేజీల్లో పిల్లల భవిష్యత్తు బాగుండాలని తాను ఆలోచిస్తానన్నారు.
భట్టన్నా...నా మీద ప్రేమ లేదా అన్నా
భట్టన్నా... నా మీద ప్రేమ లేదా అన్నా అని అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ డిప్యూటీ సీఎం భట్టితో మాజీ మంత్రి మల్లారెడ్డి సరదాగా మాట్లాడారు. దీనికి స్పందించిన భట్టి...చాలా ప్రేమ ఉందంటూ మల్లారెడ్డిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మల్లారెడ్డిని సీఎల్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరు కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.