ఐఏఎస్​లు మా ఫోన్లు ఎత్తుతలేరు 

ఐఏఎస్​లు మా ఫోన్లు ఎత్తుతలేరు 

హైద‌రాబాద్, వెలగు:ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము ఐఏఎస్​ అధికారులకు ఫోన్​ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని  కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఫోన్​ ట్యాంపరింగ్​ అవుతుందోనని వాళ్లు భయపడుతూ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా అధికారులు స్పందించకపోతే పరిస్థితి ఏమిటని, తమ వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని  కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యేకు ఇదే జరిగిందని, చివరికి పరిస్థితిని అర్థం చేసుకొని సదరు ఎమ్మెల్యేనే అధికార పార్టీలో చేరిపోవాల్సి వచ్చిందని గాంధీభవన్​లో కొందరు నేతలు చర్చించుకుంటూ కనిపించారు. ‘‘కొన్నాళ్ల క్రితం తన నియోజకవర్గం పరిధిలోని ప్రజల సమస్యలపై ఓ ఐఏఎస్​ అధికారికి కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్​ చేయలేదు.

చేయ‌గా చేయ‌గా ఫోన్ ఎత్తి మ‌రో నంబర్​తో  కాల్ చేస్తాన‌ని చెప్పారు. కానీ ఎంత ఎదురుచూసినా ఐఏఎస్​ అధికారి నుంచి రిట‌ర్న్ కాల్ రాలేదు. చాలాసార్లు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రతిపక్ష పార్టీలో ఉన్నందుకే  స‌ద‌రు ఆఫీస‌ర్ తన  కాల్ కు స్పందించ‌టం లేద‌ని ఎమ్మెల్యేకు అర్థమైంది. ఒక్క ఆఫీసరే కాదు.. చాలా మంది బ్యూరోక్రాట్లు ఇలాగే వ్యవహరించడంతో చివరికి ఎమ్మెల్యేనే అధికార పార్టీలో చేరిపోయారు” అని ఆ నేతలు అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పార్టీ మారే పరిస్థితులను కొందరు ప్రభుత్వ పెద్దలు ఈ రకంగా క్రియేట్​ చేస్తున్నారని, ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో పలువురు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కున్నవారేనని వారు తెలిపారు.

ట్యాంపరింగ్​ భయం!

కొందరు ఐఏఎస్ ఆఫీసర్లకు ఫోన్​ ట్యాంపరింగ్​ భయం పట్టుకుందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్​ మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకు తెలిసిపోతుందని వారు జంకుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను ఐఏఎస్  అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్​ చేస్తుంటే రెస్పాండ్​ అవడం లేదని కాంగ్రెస్​సీనియ‌ర్ ఎమ్మెల్యే అన్నారు. ఎప్పుడు కాల్ చేసినా క‌ట్ చేసి మీటింగ్ లో ఉన్నట్లు మెసేజ్ చేయ‌టం లేదా.. వేరే నంబ‌ర్ తో కాల్ చేస్తామని చెప్పి అప్పటికప్పుడు త‌ప్పించుకునే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

కొంద‌రు ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారులు కూడా ప్రతిప‌క్ష ఎమ్మెల్యేల‌తో ఫోన్ లో మాట్లాడేందుకు భయపడుతున్నారని, వారికి ఫోన్​ ట్యాంపరింగ్​ భయం పట్టుకుందని అన్నారు. అధికారులు ఇలా వ్యవహరిస్తే..  సమస్యల పరిష్కారం కోసం త‌మ వ‌ద్దకు వ‌చ్చే ప్రజలకు తాము ప‌రిష్కారం ఎలా చూపుతామని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కార‌ణాలు ఏవైనా అధికారులు ఇలా వ్యవహరించడంతో పార్టీ మార‌క త‌ప్పని ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయని తాజాగా టీఆర్ ఎస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే అన్నారు.