రాష్ట్ర ఐఏఎస్‌‌లలో రెండు గ్రూపులు

రాష్ట్ర ఐఏఎస్‌‌లలో రెండు గ్రూపులు

సీఎస్ వర్గం ఒకవైపు..  ఇతర ఆఫీసర్లు మరోవైపు!
బయట పడుతున్న విభేదాలు.. సీఎంకు ఫిర్యాదులు
సీఎస్‌‌కు దగ్గరి వారికే మంచి పోస్టులు, 
ఎక్స్‌‌టెన్షన్లు ఇస్తున్నారని విమర్శలు
కనీసం రిటైర్‌‌‌‌మెంట్‌‌ విషయంలోనూ 
గౌరవం ఇవ్వట్లేదని కొందరి ఆవేదన
తెలంగాణ ఐఏఎస్‌‌లకు దక్కని ప్రయారిటీ పోస్టులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ప్రాధాన్యమున్న పోస్టులు దక్కుతున్న వాళ్లు ఒకవైపు.. సీనియారిటీ ఉండి, ఏండ్ల తరబడి నాన్ ప్రయార్టీ పోస్టుల్లోనే పని చేస్తూ రిటైర్ అవుతున్న వాళ్లు ఇంకోవైపు ఉండిపోయారు. మరోవైపు తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణకు చెందిన ఐఏఎస్‌‌ ఆఫీసర్లు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఐఏఎస్​లు ప్రజా సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర విషయాలను చెప్పాలి. కానీ రాష్ట్రంలో విచిత్రంగా ఐఏఎస్‌‌లు ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఇయర్ ఎండ్ పార్టీ ఏర్పాటు చేస్తే తొలుత చాలామంది రాబోమని తేల్చిచెప్పారు. అవసరమైనప్పుడు అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వని వాళ్లు.. పార్టీలకు పిలిస్తే రావాలా అని తమకు సమాచారం ఇచ్చిన జీఏడీ అధికారులకు సమాధానమిచ్చారు. 

దీంతో ఎక్కువ మంది రాకపోతే వేరే అభిప్రాయం ఏర్పడుతుందని భావించిన సీఎస్.. తానే ఫోన్ చేసి అందరినీ రమ్మని పిలిచినట్లు తెలిసింది. అయినప్పటికీ కొందరు రిటైర్డ్ ఐఏఎస్‌‌‌‌లు రాలేదు. రాష్ట్రంలో ప్రాధాన్యత పోస్టులు బీహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐఏఎస్‌‌‌‌లతో పాటు సీఎస్‌‌‌‌కు దగ్గర ఉన్న వారికే దక్కుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్ అవుతున్న కొందరు ఐఏఎస్‌‌‌‌లను కనీసం గౌరవంగా పంపట్లేదనే చర్చ జరుగుతున్నది. ఇక్కడ మంచి పోస్టులు ఇవ్వడం లేదని కొందరు ఐఏఎస్‌‌‌‌లు సెంట్రల్ సర్వీస్‌‌‌‌లోకి వెళ్తుండటం గమనార్హం.

తెలంగాణ ఐఏఎస్‌‌‌‌లకు అన్యాయం

తెలంగాణకు చెందిన ఐఏఎస్‌‌‌‌లు పోస్టింగ్‌‌‌‌ల కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శైలజా రామయ్యర్, దాసరి హరిచందన వెయిటింగ్‌‌‌‌లో ఉన్నారు. జలమండలి ఎండీగా దానకిషోర్, ఎంసీఆర్​హెచ్ఆర్డీ జాయింట్ డీజీగా అనితా రాజేంద్ర, పబ్లిక్​ ఎంటర్ ప్రైజెస్‌‌‌‌కు సెక్రటరీగా కె. నిర్మల, అడిషనల్ సెక్రటరీగా భారతి లక్​పతి నాయక్, షెడ్యూల్డ్ క్యాస్ట్​లో విజయ్ కుమార్, ఫైనాన్స్‌‌‌‌లో శ్రీదేవి, నిధులు, స్కీములు లేకుండా ఉన్న బీసీ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శిగా బుర్రా వెంకటేశం, లేబర్ డిపార్ట్​మెంట్​స్పెషల్​ సీఎస్​గా రాణి కుముదిని.. ఇలా ప్రాధాన్యత లేని శాఖల పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల రిటైరైన చంపాలాల్.. గెజిట్స్ సెక్రటరీగా, కోఆపరేటివ్ కమిషనర్​గా వీరబ్రహ్మయ్య పని చేశారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌‌‌‌గా రామకృష్ణారావు మాత్రమే మంచి పోస్టులో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమకు నాన్ ప్రయార్టీ పోస్టులు ఇస్తున్నారని ఎస్సీ, ఎస్టీ అధికారులకు కీలకమైన పోస్టింగులు ఇవ్వడం లేదంటూ గతంలో ఐఏఎస్‌‌‌‌లు ఆకునూరి మురళి, శ్యాం నాయక్, చంపాలాల్, భారతి లక్​పతినాయక్,​ ప్రీతిమీనా వంటి వారు ప్రభుత్వానికి నివేదించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే నిరసనగా మురళి రెండున్నర ఏండ్ల కిందటే వీఆర్ఎస్ తీసుకున్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో రాహుల్ బొజ్జాను ప్రభుత్వం సీఎంవోలోకి తీసుకున్నది.

ఒక వర్గానికే కీలక పోస్టింగ్‌‌‌‌లు

రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన ఐఏఎస్‌‌‌‌లకే ప్రాధాన్యత దక్కుతున్నదన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అర్వింద్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్, ఐటీ, ఇండస్ర్టీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా సర్ఫరాజ్,  ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ, గురుకులాల సెక్రటరీగా రొనాల్డ్ రాస్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, ఎస్సీ డెవలప్​మెంట్ సెక్రటరీ రాహుల్ తదితరులు.. సీఎస్‌‌‌‌కు దగ్గరి వాళ్లని ఓ ఐఏఎస్ చెప్పారు. గత ఏడాదిలో రిటైర్ అయిన అధర్ సిన్హాకు రెండేండ్ల ఎక్స్‌‌‌‌టెన్షన్ ఇప్పించి.. పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్​గా ప్రభుత్వం తిరిగి కొనసాగిస్తున్నది. జీఏడీలో ప్రొటోకాల్ విభాగంలో ఉన్న అర్విందర్ సింగ్‌‌‌‌కూ రెండేండ్ల ఎక్స్​టెన్షన్ ఇచ్చి అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ సీఎస్‌‌‌‌కు దగ్గరి వాళ్లు అనే చర్చ జరుగుతున్నది. ఇక పోస్టింగ్‌‌‌‌ల విషయంలో ఇబ్బందిగా ఫీల్ అయిన మాణిక్ రాజ్, శశాంక్ గోయల్ లాంటి ఐఏఎస్‌‌‌‌లు సెంట్రల్ సర్వీస్‌‌‌‌లోకి వెళ్లారు.

కనీస గౌరవం ఇవ్వట్లేదని!

రిటైర్ అవుతున్న కొందరు ఐఏఎస్​లకు.. పోస్టింగ్ విషయంలో, డిపార్ట్​మెంట్ విషయాల్లో ఏదైనా వినతిని ఇచ్చుకుందామనకునే ఐఏఎస్‌‌‌‌లకు సీఎస్ అపాయింట్‌‌‌‌మెంట్ కూడా దొరకట్లేదని తెలిసింది. కొన్నిసార్లు సీనియర్ ఐఏఎస్​లకూ ఇదే అనుభవం ఎదురవుతున్నదని సమాచారం. 2022లో రిటైరైన ఐఏఎస్‌‌‌‌ల్లో ఇద్దరికి ఎక్స్​టెన్షన్ వచ్చింది. వారి ద్దరి తప్ప మిగిలిన వారిని కనీసం గౌరవంగా పంపలేదని ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే డిసెంబర్ 30వ తేదీన జరిగిన కార్యక్రమంలో అధర్ సిన్హా, అర్విందర్ సింగ్ మాత్రమే సన్మానానికి అటెండ్ అయ్యారు. ఐఏఎస్​లు శాలిని మిశ్రా, ఒమర్ జలీల్, వీరబ్రహ్మయ్య, శర్మన్, ప్రీతి సుడాన్ లాంటివాళ్లు హాజరుకాలేదు. తమకు పోస్టింగుల్లో గౌరవం ఇవ్వలేదని, రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌లోనూ అలాగే వ్యవహరించారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీఎం కేసీఆర్ దగ్గర కూడా ఐఏఎస్‌‌‌‌లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు తెలిసింది.