సీఎం రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ శరత్‌.. గులాంగిరీ నుంచి ఐఏఎస్లు బయటపడతారా ?

సీఎం రేవంత్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ శరత్‌.. గులాంగిరీ నుంచి ఐఏఎస్లు బయటపడతారా ?

హైదరాబాద్: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్.. అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగ సర్వీసు. ప్రభుత్వంలో వాళ్లది కీ రోల్.. కానీ తెలంగాణలో అది కాస్తా దిగజారింది. పాలకుల ముందు సాగిలా పడుతోంది. కాళ్లు మొక్కేదాకా వెళ్లింది. నిన్న నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్‌ ముఖ్యమంత్రి కాళ్లు మొక్కారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సీరియస్ అయ్యారు.

ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలని సూచించారు. అధికారుల ప్రవర్తనతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని పేర్కొంటూ నోటీసు జారీ చేశారు. శరత్ అనుచిత ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా కాళ్లు మొక్కడం వల్ల ప్రజల్లో విశ్వసం కోల్పోతారని అన్నారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్–1964 ప్రకారం ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని, ప్రభుత్వం ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని సూచించారు. 

కేసీఆర్ హయాంలో స్టార్ట్
తెలుగు రాష్ట్రాల్లో పాదాభివందనం చేయడం మునుపెన్నడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత  పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు అప్పటి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామారెడ్డి పాదాభివందనం చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత చాంబర్ లోనే కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. అదే రోజు కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లగా ఇదే శరత్ అక్కడ  కలెక్టర్గా ఉన్నారు.

ALSO READ | అధికారులు గౌరవాన్ని  దిగజార్చుకునేలా వ్యవహరించొద్దు: ఐఏఎస్​ శరత్ తీరుపై ప్రభుత్వం సీరియస్​

కేసీఆర్ కలెక్టరేట్ ప్రారంభించగానే  పాదాభివందనం చేశారుముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించడమేంటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్తువెత్తాయి. అప్పట్లో చీఫ్ సెక్రటరీలుగా ఉన్న వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో అప్పటి వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు మొక్కారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ను కలిసిన శ్రీనివాసరావు.. పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళ్లు మొక్కారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా కూడా మరోసారి కాళ్ల మీద పడ్డారు.

మార్పు సాధ్యమేనా ?
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాలకులతో వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో కలెక్టర్  హోదాలో ఉండి కాళ్లు మొక్కిన  వెంకట్రామారెడ్డి ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ పై ఆశపడ్డ మాజీ డీహెచ్ గడల శ్రీనివాసరావుకు నిరాశే మిగిలింది. శరత్ విషయానికి వస్తే ఆయన గతంలో కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి హోదాలో ఉండి సీఎం రేవంత్ రెడ్డికీ పాదాభివందనం చేశారు. ఏది ఏమైనా అత్యున్నత స్థాయిలో ఉండి కాళ్లు మొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామకృష్ణారావు ఇచ్చిన నోటీసుతోనైనా అధికారుల్లో మార్పు వస్తుందా..? అన్న చర్చ మొదలైంది.