ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) మంగళవారం ఆమోదించింది. దీంతో డేకా.. 2026 జూన్ 30 వరకు ఐబీ చీఫ్​గా కొనసాగనున్నారు. తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండో సారి.

గతంలో 2024 జూన్‌‌లో కూడా ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. తపన్ కుమార్ డేకా.. 1988 బ్యాచ్‌‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. 2022 జులైలో ఆయన ఐబీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించారు. డేకా.. ఉగ్రవాద నిరోధక వ్యూహాలలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, 26/11 ముంబై ఉగ్రదాడి కౌంటర్​ఆపరేషన్ లో ప్రముఖ పాత్ర పోషించి, దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టారు.

అంతేకాకుండా, పాకిస్తాన్ ఆధారిత ముజాహిదీన్ గ్రూపులను ఎదుర్కోవడంలో, జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఆయనకు అపార అనుభవం ఉండడంతో.. జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలపై ప్రభుత్వానికి 
ఆయన ముఖ్య అధికారిగా ఉన్నారు.