పైరసీతో ఐదేండ్లలో 100 కోట్లు..ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతాల్లో రూ.30 కోట్లకుపైగా లావాదేవీలు

పైరసీతో ఐదేండ్లలో 100 కోట్లు..ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతాల్లో రూ.30 కోట్లకుపైగా లావాదేవీలు
  •     ముగిసిన పోలీస్​ కస్టడీ

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ వైబ్ సైట్ సూత్రధారి ఇమ్మడి రవి ఐదు రోజుల పోలీసు కస్టడీ విచారణ సోమవారంతో ముగిసింది. సీసీఎస్  సైబర్ క్రైం పోలీసులు ఐదు రోజుల పాటు రవి ఆర్థిక 
లావాదేవీలు, పైరసీ నెట్‌‌వర్క్‌‌, సాంకేతిక కార్యకలాపాలు వంటి అంశాలపై విచారించారు. 

రవి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా జరిగిన డబ్బు మార్పిడి, విదేశీ కరెన్సీ బదిలీలపై లోతుగా దర్యాప్తు చేశారు. రవికి చెందిన వివిధ బ్యాంకు  ఖాతాల్లో రూ.30 కోట్లకుపైగా లావాదేవీలు గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పైరసీ ద్వారా గత ఐదేండ్లలో 100 కోట్ల రూపాయల వరకు రవికి ఆదాయం వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 

పోలీసుల విచారణలో రవి టెలిగ్రాం యాప్  ద్వారా సినిమాలను కొనుగోలు చేసి, వాటిని ఐబొమ్మ సైట్​లో రిలీజ్ చేస్తున్నట్లు బయటపడింది. సైట్‌‌లో సినిమా క్లిక్  చేయగానే యూజర్లను  మ్యాట్రిమోని, బెట్టింగ్, గేమింగ్ యాప్‌‌లకు మళ్లించేలా 15కు పైగా యాడ్  నెట్‌‌వర్క్‌‌లను లింక్  చేసినట్లు పోలీసులు గుర్తించారు. మన దేశంలోని ఐడీఎఫ్‌‌సీ బ్యాంక్  ద్వారా వచ్చిన డబ్బును రవి క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపినట్లు సమాచారం. 

నేడు రవి బెయిల్ పిటిషన్ పై విచారణ

రవి మొదటి నుంచి క్రిమినల్  మైండ్‌‌సెట్‌‌తో వ్యవహరించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్యను వేధింపులకు గురిచేయడంతో... ఆమె విడాకులు తీసుకున్నట్లు విచారణలో రవి తెలిపినట్లు సమాచారం. ఐబొమ్మ సైట్ పోస్టర్లను డిజైన్  చేసినందుకు తన స్నేహితుడు నిఖిల్ కు నెలకు రూ.50 వేలు ఇచ్చేవాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. కస్టడీ ముగియడంతో రవికి వైద్య పరీక్షల చేయించారు. 

అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. రవి కేసు వాదిస్తున్న న్యాయవాది శ్రీనాథ్  మాట్లాడుతూ...రవి కస్టడీలో సహకరించలేదన్నది అవాస్తవమన్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క కేసులోనే రిమాండ్  విధించారని తెలిపారు. మిగిలిన నాలుగు కేసుల్లో పీటీ వారంట్  కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రవి కోసం బెయిల్  పిటిషన్  వేశామని, దీనిపై మంగళవారం వాదనలు జరగనున్నాయని చెప్పారు.