
చెస్టర్ లీ స్ట్రీట్: వరల్డ్‌కప్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ బుధవారం కీలక మ్యాచ్ ఆడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్లకు ఇది చివరి మ్యాచ్ కాగా విజయం సాధించిన టీమ్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలాగని ఓడిన జట్టుకు పూర్తిగా ద్వారాలు మూసుకుపోవు. ఒక వేళ కివీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతే పాకిస్థాన్‌కు అది శుభవార్త అవుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే సెమీస్‌కు వచ్చేస్తుంది. ఒకవేళ కివీస్ పరాజయం పాలైనా కూడా పాక్ రేసులో ఉంటుంది. కానీ, మైనస్ రన్‌రేట్‌తో ఉన్న ఆ జట్టు బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిస్తే బ్లాక్‌క్యాప్స్ టీమ్‌ను దాటి నాకౌట్‌కు చేరుకుంటుంది. అందువల్ల రన్‌రేట్‌ను కాపాడుకోవడం కూడా కివీస్ కు ముఖ్యమే. ఇండియా చేతిలో ఓటమితో బంగ్లా రేసు నుంచి వైదొలిగింది. సమీకరణాలు ఎలా ఉన్నా ఇంగ్లండ్, కివీస్ సెమీస్ అవకాశాలు మాత్రం ఇప్పటికైతే వారి చేతుల్లోనే ఉన్నాయి. బలాబలాల విషయానికి కొస్తే వరుస ఓటముల తర్వాత టీమిండియాపై సాధించిన విజయంతో ఇంగ్లండ్ జట్టు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. . ఇండియాతో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన జేసన్ రాయ్ జట్టు బలాన్ని పెంచగా, బెన్ స్టోక్స్ తురుపు ముక్కగా మారాడు. క్రిస్ వోక్స్, ప్లంకెట్ కూడా టచ్‌లోకి రావడంతో బౌలింగ్ విభాగం సత్తా పెరిగింది. మరోపక్క న్యూజిలాండ్‌ను మాత్రం పలు సమస్యలు వేధిస్తున్నాయి. బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్‌పైనే పడడం కలవరపెడుతోంది. ఓపెనర్లు గప్టిల్, మన్రో వరుసగా విఫలమవుతున్నారు.