ఆరో విజయంపై ఆరెంజ్ టీమ్ గురి

ఆరో విజయంపై ఆరెంజ్ టీమ్ గురి
  • నేడు ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌
  • గెలిస్తే సెమీస్‌‌ బెర్తు ఖరారు
  • ఆరెంజ్‌‌ జెర్సీతో బరిలోకి
  • తీవ్ర ఒత్తిడిలో హోమ్‌‌టీమ్‌‌

వరుస విజయాలతో దూసుకెళ్తూ, ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ,  సవాళ్లను అధిగమిస్తూ.. గాయాలు ఇబ్బంది పెట్టినా.. సమస్యలు వెంటాడినా..  చెదరని  ఆత్మవిశ్వాసంతో  మూడో వరల్డ్‌‌కప్‌‌ వేటలో ఓ రేంజ్‌‌లో ముందుకెళ్తున్న టీమిండియా మెగా టోర్నీలో  ‘నాకౌట్‌‌’ పంచ్‌‌ ఇచ్చేందుకు రెడీ అయింది. ఐదు విజయాలతో ఇప్పటికే సెమీస్‌‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్న కోహ్లీసేన  ‘సిక్సర్‌‌’ కొట్టాలని తహతహలాడుతోంది. గెలుపు ఊపును కొనసాగిస్తూ  హోమ్‌‌టీమ్‌‌ ఇంగ్లండ్‌‌నూ బాదేసి.. నాకౌట్‌‌ బెర్త్‌‌ను అధికారికంగా అందుకోవాలని చూస్తోంది. అదే టైమ్‌‌లో సెమీస్‌‌కు ముందు మిడిలార్డర్‌‌ సమస్యను కూడా పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టింది. తొలిసారి ఆరెంజ్‌‌ జెర్సీలో బరిలోకి దిగుతున్న  ఇండియా.. అదే రేంజ్‌‌లో ఆడాలని భావిస్తోంది. అటు  అన్ని విభాగాల్లో అత్యంత బలంగా ఉన్నా..  టైటిల్‌‌ ఫేవరెట్‌‌ హోదాకు న్యాయం చేయలేక.. సెమీస్‌‌ ముందే  టోర్నీ నుంచి నాకౌటయ్యే ప్రమాదంలో నిలిచిన మోర్గాన్‌‌సేనకు ఇది విషమ పరీక్ష. కానీ, డీలా పడింది కదా అని ఇంగ్లండ్‌‌ను లైట్‌‌ తీసుకుంటే  మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

బర్మింగ్‌హామ్‌: నీలి రంగు జెర్సీలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్న టీమిండియా.. ఆరెంజ్‌ కలర్‌లోనూ అదగొట్టేందుకు సిద్ధమైంది.  సెమీస్‌ బెర్తు, టాప్‌ ప్లేస్‌పై కన్నేసిన కోహ్లీసేన ఆదివారం జరిగే  హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుస విజయాలు, బ్యాటింగ్‌, బౌలింగ్‌లో యమ జోరు మీదున్న కోహ్లీసేనే ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌. మరోవైపు టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆరంభంలో అద్భుత ఆటతో అదరగొట్టి అనూహ్యంగా డీలా పడ్డ  ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవో లాం టింది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు, విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లతో ఉన్న మోర్గాన్‌సేన.. ఇందులో ఓడితే సెమీస్‌కు చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. దీంతో ఒత్తిడంతా  వారిపైనే ఉండనుంది. . ఇప్పుడున్న పరిస్థితుల్లో  కోహ్లీసేనను ఓడించి నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇంగ్లండ్‌ నంబర్‌ వన్‌ ఆటను బయటకు తీయాల్సిందే.

కోహ్లీ మొగ్గు శంకర్‌వైపే

ఆరు మ్యాచ్‌లు. వర్షంతో ఓ మ్యాచ్‌ రద్దు. మిగతా ఐదింటిలోనూ విజయాలే. 11 పాయింట్లతో  సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైనట్టే.  ఓ స్టార్‌ ఓపెనర్‌ గాయంతో టోర్నీకి దూరమైనా.. మరోకరు బాధ్యత తీసుకున్నారు. మరో స్టార్‌ పేసర్‌ గాయపడినా..  బరిలోకి వచ్చిన ఇంకో బౌలర్ రప్ఫాడిస్తున్నాడు. కెప్టెన్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మాజీ సారథి ధోనీ టచ్‌లోకి వచ్చాడు. స్పిన్నర్లు  చెలరేగిపోతున్నారు. అదే  రేంజ్‌లో జట్టుకు విజయాలూ లభిస్తున్నాయి. కానీ, ఒక్కటే లోటు. మిడిలార్డర్‌ సమస్య  జట్టును వెంటాడుతోంది. టాపార్డర్‌ మెరుస్తున్నప్పుడు అంతా సవ్యంగానే సాగుతోంది. కానీ, టాప్‌ తడబడిన వేళ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బాధ్యత తీసుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన నాలుగో నంబర్‌లో విజయ్‌ శంకర్‌ వైఫల్యం ఆందోళనగా మారింది. శుభారంభాలను సద్వినియోగం చేసుకోవడంలో శంకర్‌ విఫలమవుతున్నాడు. దాంతో, అతని స్థానంలో యంగ్‌స్టర్‌ రిషబ్‌ పంత్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌లో ఒకరిని ఆడించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, కోహ్లీ మాత్రం శంకర్‌కే మొగ్గు చూపుతున్నాడు. శంకర్‌ ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడేందుకు దగ్గర్లోకి వచ్చాడని చెబుతున్నాడు. అందువల్ల పంత్‌ వరల్డ్‌కప్‌ అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. అఫ్గాన్‌పై హాఫ్‌ సెంచరీ చేసిన కేదార్‌ జాదవ్‌ నుంచి కూడా  టీమ్‌ మరో మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది.  వెస్టిండీస్‌పై ఫిఫ్టీ కొట్టిన ధోనీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. రోహిత్‌, కోహ్లీతో పాటు లోకేశ్‌, హార్దిక్‌ ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నారు.  వీరి జోరుకు ధోనీ మెరుపులు కూడా తోడైతే జట్టుకు తిరుగుండకపోవచ్చు.  ధోనీని నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దింపాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. మరి, కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.

తిరుగులేని బౌలింగ్‌

అత్యంత బలమైన బౌలింగ్‌ లైనప్‌తో  ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమిండియా బంతితో అంచనాలకు మించి రాణిస్తోంది. ముఖ్యంగా మహ్మద్‌ షమీ రాకతో  మన బౌలింగ్‌ మరింత పదునెక్కింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన సీనియర్‌ పేసర్‌ హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీసి జట్టుకు ఓటమి తప్పించాడు. గత పోరులోనూ బుల్లెట్ల లాంటి బంతులతో కరీబియన్లను వణికించాడు. మరోవైపు యార్కర్ల కింగ్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేస్తుండడంతో  చిన్న టార్గెట్లను కూడా ఇండియా కాపాడుకుంటోంది.  ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ఇక, స్పిన్‌ ద్వయం కుల్దీప్‌, చహల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిచ్‌ నుంచి అంతగా సహకారం లేకున్నా కూడా  వైవిధ్యమైన బంతులతో టర్న్‌ రాబడుతూ మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్లను దెబ్బ తీస్తున్నారు.  ఆదివారం బాగా ఎండకాసే అవకాశం, ఉపఖండాన్ని పోలిన వాతావరణం, వికెట్‌ ఉండడంతో వీరిద్దరూ మరింత ప్రమాదకరంగా మారడం పక్కా. అయితే, ఇంగ్లండ్‌లో అందరూ హార్డ్‌ హిట్టర్లే కాబట్టి.. బౌలర్లు కాస్త జాగ్రత్త వహించడం కూడా అవసరమే.

ఇంగ్లండ్‌కు పరీక్ష

2015 వరల్డ్‌కప్‌లో అవమానకర రీతిలో వైదొలిగిన తర్వాత ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌  పవర్‌హౌజ్‌గా మారిపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో తిరుగులేని శక్తి అయింది. మోర్గాన్‌తో పాటు బట్లర్‌, బెయిర్‌స్టో, రూట్‌, జేసన్‌ రాయ్‌, బెన్ స్టోక్స్‌, మొయిన్‌ అలీ ఇలా ఆ జట్టులో అంతా ఒంటిచేత్తే మ్యాచ్‌ను గెలిపించే సమర్థులే. వారి అండతో టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కీలక సమయంలో పట్టు విడిచింది. ఇప్పుడు నాకౌట్‌ బెర్త్‌  కోల్పోయే ప్రమాదం అంచున నిలిచింది. శ్రీలంక చేతిలో అనూహ్య ఓటమి ఆ జట్టు నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసింది. ఆసీస్‌ చేతిలో పరాజయంతో మరింత డీలా పడింది. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. పైగా, ‘కొంతమంది మేం గెలవాలని కోరుకోవడం లేదు. వాళ్లు మా ఫెయిల్యూర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నార’ని  ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌ను ఉద్దేశిస్తూ బెయిర్‌స్టో చేసిన వ్యాఖ్యలు హీట్‌ పెంచాయి. పాక్‌, శ్రీలంక, ఆసీస్‌పై ఛేజింగ్‌లో ఇబ్బంది పడ్డ హోమ్‌టీమ్‌ బ్యాట్స్‌మెన్‌..  ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లను, బుమ్రా, షమీ పదునైన పేస్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఓడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ వైఫల్యమే హోమ్‌టీమ్‌ కొంపముంచింది. రాయ్‌ ప్లేస్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన జేమ్స్‌ విన్స్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. బెన్‌స్టోక్స్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా చేతులెత్తేశారు. బౌలింగ్‌లో  మాత్రం బాగానే రాణిస్తోంది. జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌  సత్తా చాటుతున్నారు.  అయితే, సమష్టిగా ఆడితే తప్ప ఇండియాకు ఇంగ్లండ్‌ పోటీ ఇచ్చే అవకాశం లేదు.   కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ కాబట్టి  గాయాలతో ఇబ్బంది పడుతున్న జేసన్‌ రాయ్‌, జోఫ్రా ఆర్చర్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాలని కెప్టెన్‌ మోర్గాన్‌ డిసైడయ్యాడు. అతని సాహసం ఫలితాన్నిస్తుందో లేదో చూడాలి.

జడేజాకు చాన్సిస్తారా?

బౌలింగ్‌లో షమీ అద్భుతంగా ఆడుతున్నా..   భువనేశ్వర్‌ లేకపోవడంతో  టీమ్‌ బ్యాలెన్స్‌ కాస్త దెబ్బతిన్నదని చెప్పాలి. ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కాస్త మెరుగ్గానే ఆడగలిగే భువీ ఉంటే లోయర్‌ ఆర్డర్‌ మరికొంత బలంగా మారేది. ఈ నేపథ్యంలో  కోహ్లీ ఐదుగురు బౌలర్ల ఫార్ములానే కంటిన్యూ చేస్తాడా లేక అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది. లెగ్‌ స్పిన్నర్లలో ఒకరిని లేదా కేదార్‌ జాదవ్‌ను తప్పించి స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చాన్సిస్తే బ్యాటింగ్‌ విభాగం మరికొంత బలంగా మారనుంది. టోర్నీ చివరి దశలో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ఆలోచించే జడేజాను టీమ్‌లో తీసుకున్నారు. అందువల్ల  నాకౌట్‌ వరకూ వేచి ఉండకుండా లీగ్‌ దశలోనే ఈ ఫార్ములాను ట్రై చేస్తే బాగుండొచ్చు.

ఆరెంజ్‌‌ జెర్సీ బాగుంది

పదికి 8 మార్కులేసిన విరాట్‌‌

ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌లో టీమిండియా వాడనున్న ఆరెంజ్‌‌ కలర్‌‌ జెర్సీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీని ఆకట్టుకుంది. పది మార్కులకు గాను కొత్త జెర్సీకి ఎనిమిది మార్కులేశాడు. ఎప్పటికీ బ్లూ కలర్​ జెర్సీనే వాడతామని,  అయితే ఒక్క మ్యాచ్‌‌కే కాబట్టి ఆరెంజ్‌‌ జెర్సీ బాగానే ఉంటుందన్నాడు. ‘ బ్లూ కలర్‌‌ జెర్సీ మా రెగ్యులర్‌‌ కలర్‌‌. ఆ జెర్సీ ధరించన ప్రతీసారి ఎంతో గర్వంగా ఫీలవుతా. ఐసీసీ రూల్స్‌‌ ప్రకారం మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌‌ కోసం ఆరెంజ్‌‌ జెర్సీ వాడుతున్నాం. అదేమి శాశ్వతం కాదు. కాస్త ఆట విడుపులాంటిది. కొత్త జెర్సీ బాగా నచ్చింది. కలర్స్‌‌ ఎంపిక కూడా బాగుంది. ఫిట్​ కూడా కుదిరింది.  నా వరకు నేను పదికి ఎనిమిది మార్కులిస్తా’ అని  విరాట్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

పిచ్‌/వాతావరణం

ఈ మ్యాచ్‌కు ఫ్రెష్‌ వికెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది టోర్నీలోనే బెస్ట్‌ బ్యాటింగ్‌ పిచ్‌ అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌, మాజీ స్పిన్నర్‌ ఆష్లే  గైల్స్‌ అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.  ఆదివారం వర్ష సూచనలు లేవు. ఎండ  ఎక్కువగా ఉండనుంది కాబట్టి వికెట్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించొచ్చు.

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌, లోకేశ్‌, కోహ్లీ (కెప్టెన్‌), శంకర్‌/ పంత్‌, ధోనీ (కీపర్‌), కేదార్‌, హార్దిక్‌, షమీ, కుల్దీప్‌, బుమ్రా, చహల్‌.

ఇంగ్లండ్‌: రాయ్‌, బెయిర్‌ స్టో, రూట్‌, మోర్గాన్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌ (కీపర్), మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌.