ICC ODI Rankings: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా పురుషుల వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ సిరీస్‌ను భారత్ కోల్పోయినప్పటికీ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఇండియన్ బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టీమిండియా ప్లేయర్స్ టాప్-5లో ఏకంగా ముగ్గురు చోటు సంపాదించుకోవడం విశేషం.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు:
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 801 రేటింగ్ పాయింట్లతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో సెకండ్ ప్లేస్ లో నిలిచి మిచెల్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. వీరి తర్వాత విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత సెంచరీ బాదిన రోహిత్ శర్మ 14 రేటింగ్ పాయింట్లను సాధించి 758 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
జంప్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు:
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 3 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా ఏకంగా 249 రన్స్ చేసి, నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 11 స్థానాలు మెరుగుపరుచుకుని19వ స్థానంలో నిలవగా, యంగ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్:
బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతడు 649 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇక ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 682 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 675 పాయింట్లతో సెకండ్ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆల్‌రౌండర్ విభాగంలో అగ్రస్థానాలు:
వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 316 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ 259 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు.
Race for the No.1 spot in the ICC Men's ODI Batting Ranking heats up as India's star trio close in 👀https://t.co/EuM54qGbZr
— ICC (@ICC) July 22, 2026
