IND vs SA: హర్షిత్ రానా ఓవరాక్షన్‌కు ఐసీసీ సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణ తప్పినందుకు డీమెరిట్ పాయింట్

IND vs SA: హర్షిత్ రానా ఓవరాక్షన్‌కు ఐసీసీ సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణ తప్పినందుకు డీమెరిట్ పాయింట్

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా క్రమశిక్షణ తప్పాడు. తొలి వన్డేలో భాగంగా ఈ పేసర్ బ్రేవీస్ వికెట్ తీసిన తర్వాత  చేసిన మితిమీరిన సెలెబ్రేషన్ ఇందుకు కారణం. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సఫారీ చిచ్చర పిడుగు డేవాల్డ్ బ్రేవీస్ తనదైన శైలిలో కొన్ని బౌండరీలు కొట్టి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇన్నింగ్స్ 22 ఓవర్లో హర్షిత్ రానా బౌలింగ్ లో బ్రేవీస్ ఔటయ్యాడు. బౌండరీ దగ్గర గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో రానా అత్యుత్సాహంతో బ్రేవీస్ ను చూస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళు అన్నట్టు హద్దులు మీరు సెలబ్రేషన్ చేసుకున్నాడు.   

"రాంచీలో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత భారత పేసర్ హర్షిత్ రాణా మందలింపు అందుకున్నాడు. హర్షిత్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించినట్లు తేలింది. 'అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మన్ అవుట్ అయినప్పుడు అతనిని అవమానించేలా లేదా దూకుడుగా స్పందించినా.. లేకపోతే సైగలు చేసినా పనిష్ మెంట్ ఉంటుంది. హర్షిత్ ప్రోటీస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేసినట్లు తేలింది. దీంతో తన క్రమశిక్షణ ఉల్లంఘించాడని ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వాల్సి వచ్చింది". అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. . 

ALSO READ : దేవుడా.. మళ్లీ టాస్ ఓడిపోయాం..

హర్షిత్ రానా హద్దులు దాటి సెలెబ్రేషన్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ 2024 సీజన్ లో రానా కేకేఆర్ తరపున ఆడుతూ సన్ రైజర్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసి ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ పెవిలియన్ కు వెళ్ళు అని ఓవరాక్షన్ చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఇటీవలే జరిగిన తొలి వన్డేలో హర్షిత్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్ల స్పెల్ లో 65 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఒకే ఓవర్లో డికాక్, రికెల్ టన్ లను డకౌట్ చేశాడు. అంతేకాదు కీలక సమయంలో బ్రేవీస్ వికెట్ పడగొట్టి టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీమిండియా రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్ లో హర్షిత్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు.