వడ్డీ ఆశ చూపించి బ్యాంక్ మేనేజర్ మోసం .. రూ.13.5 కోట్లు స్వాహా

వడ్డీ ఆశ చూపించి బ్యాంక్ మేనేజర్ మోసం .. రూ.13.5 కోట్లు స్వాహా

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ఓ భారత సంతతి మహిళకు వడ్డీ ఆశ చూపించి నమ్మించి మోసం చేశాడు. అక్రమ లావాదేవీలు నిర్వహించి దాదాపుగా రూ.13.5 కోట్లను ఆమె అకౌంట్ నుంచి కొల్లగొట్టాడు. శ్వేతవర్మ తన భర్తతో కలిసి 2016లో ఇండియాకు వచ్చింది. నిందితుడైన బ్యాంక్ మేనేజర్ ను ఓ కామన్ ఫ్రెండ్ ద్వారాకలిసింది. అతడు డబ్బులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే 5.5 % నుంచి 6% వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. 

దీంతో శ్వేతావర్మ.. అమెరికాలోని బ్యాంక్ అకౌంట్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.13.5 కోట్లను  ట్రాన్స్ ఫర్ చేసింది. దాదాపుగా నాలుగేండ్ల వ్యవధిలో సెప్టెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2023 వరకు ఆ డబ్బులను అతడికి ఇచ్చింది. ఇక్కడే మేనేజర్ కుట్రకు తెరలేపాడు. బ్యాంక్ రికార్డుల్లో శ్వేత వర్మ మొబైల్ నంబర్ ను తారుమారు చేశాడు. ఆమె పేరుతో ఫేక్ ఈమెయిల్ ఐడీ రూపొందించి.. ఫేక్ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. 

ఈ నేపథ్యంలో ఆమెకు బ్యాంకు విత్ డ్రా నోటిఫికేషన్స్ రాలేదు. కానీ, ఈ ఏడాది జనవరిలో తన డబ్బు అంతా మాయమైనట్టు ఆమె గుర్తించింది. ఈ విషయంపై బ్యాంక్ అధికారులకు సమాచారమివ్వగా వారు మేనేజర్​ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చామని వివరించారు. మేనేజర్​పై ఆరోపణలు రుజువైతే వడ్డీతో సహా పూర్తి డబ్బులను ఆమెకు అందిస్తామని వెల్లడించారు.