క్యూ1 లో 50%  పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం

క్యూ1 లో 50%  పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
  • బ్యాంకులు అదరగొట్టాయ్‌
  • క్యూ1 లో 50%  పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
  • తగ్గిన కోటక్ బ్యాంక్  ప్రొవిజన్లు
  • రాణించిన యెస్ బ్యాంక్‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:  బ్యాంక్‌‌ల పనితీరు జూన్‌‌తో ముగిసిన క్వార్టర్‌‌ (క్యూ1) ‌‌లో మెరుగుపడింది. టాప్‌‌ బ్యాంకుల రిజల్ట్స్ అంచనాలకు మించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం క్యూ1 లో 50 శాతం పెరగగా, యెస్ బ్యాంక్ లాభం 50‌‌‌‌ శాతం, బంధన్ బ్యాంక్ లాభం ఏకంగా 137 శాతం ఎగిసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌ లాభం కూడా పెరిగింది. వీటి మొండిబాకీలూ  క్యూ1 లో తగ్గాయి.
 
వివిధ బ్యాంకుల క్యూ1 రిజల్ట్స్‌‌..

ఐసీఐసీఐ బ్యాంక్‌‌

ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం కిందటేడాది క్యూ1 తో పోలిస్తే ఈ క్యూ1 లో 50 శాతం పెరిగి రూ. 6,904.94 కోట్లకు చేరుకుంది. కిందటేడాది క్యూ1 లో రూ. 4,616.02 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన చూస్తే  రూ. 10,935.76 కోట్ల నుంచి రూ. 13,210.02 కోట్లకు పెరిగింది.   బ్యాంక్ ప్రొవిజన్లు (ట్యాక్స్‌‌ కోసం కేటాయించిన ప్రొవిజన్లు మినహాయించి) క్యూ1 లో 60 శాతం తగ్గాయి. కిందటేడాది క్యూ1 లో రూ. 2,852 కోట్లను వివిధ ప్రొవిజన్ల కోసం పక్కన పెట్టిన బ్యాంక్‌‌,  ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ. 1,144 కోట్లను ప్రొవిజన్ల కోసం కేటాయించింది. ఇందులో  అకస్మాత్తుగా జరిగే ఈవెంట్ల కోసం  (కాంటింజెన్సీ ప్రొవిజన్లు) రూ. 1,050 కోట్లుగా ఉన్నాయి.  ఐసీఐసీఐ బ్యాంక్ అసెట్ క్వాలిటీ  జూన్ క్వార్టర్‌‌‌‌లో మెరుగుపడింది. బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏల  రేషియో కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో  5.15 శాతంగా నమోదవ్వగా, ఈ జూన్ క్వార్టర్‌‌‌‌లో 3.41 శాతానికి మెరుగుపడింది.

అదే క్వార్టర్లీ పరంగా చూస్తే , ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో నమోదైన 3.60 శాతం నుంచి తగ్గింది.  అదే నికర  ఎన్‌‌పీఏల రేషియో మార్చి  క్వార్టర్‌‌‌‌లో 0.76 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్‌‌‌‌లో 0.70 శాతానికి మెరుగుపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన చూస్తే జూన్ క్వార్టర్‌‌‌‌లో 13 శాతం పెరిగి రూ. 10.5 లక్షల కోట్లకు ఎగిశాయి. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు యావరేజ్‌‌గా 23 శాతం పెరగగా, సేవింగ్స్ అకౌంట్ల డిపాజిట్లు యావరేజ్‌‌గా 19 శాతం పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన అప్పులు కూడా జూన్ క్వార్టర్‌‌‌‌లో పుంజుకున్నాయి. బ్యాంక్ రిటైల్‌‌ సెగ్మెంట్‌‌లో ఇచ్చిన అప్పులు  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఈ జూన్ క్వార్టర్‌‌‌‌లో 24 శాతం పెరిగాయి. బ్యాంక్ మొత్తం లోన్లలో రిటైల్ సెగ్మెంట్ వాటా 53.1 శాతానికి ఎగిసింది. బ్యాంక్ మొత్తం అడ్వాన్స్‌‌లు  21 శాతం పెరిగి రూ. 8.95 లక్షల కోట్లకు చేరుకుంది. ఫాస్టాగ్‌‌  ద్వారా టోల్ కలెక్షన్లలో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్‌‌లో ఉంది.  32 శాతం మార్కెట్ వాటాతో ముందుంది. 

కోటక్ బ్యాంక్‌‌

ప్రొవిజన్ల కోసం కేటాయించే ఫండ్స్‌‌ తగ్గడంతో  కోటక్ బ్యాంక్ నికర లాభం క్యూ1లో పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 1,641.90 కోట్లతో పోలిస్తే బ్యాంక్‌‌ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో 26.10 శాతం పెరిగి రూ. 2,070.10 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం క్యూ1 లో రూ. 4,697 కోట్లకు పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ.3,941.70 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ప్రకటించింది. ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని కూడా లెక్కిస్తే, కోటక్ బ్యాంక్ మొత్తం ఆదాయం జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ. 11,658.94 కోట్లుగా ఉంది. కోటక్ బ్యాంక్ మొండిబాకీలు క్యూ1 లో తగ్గాయి. బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏలు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో రూ. 6,470 కోట్లుగా రికార్డవ్వగా, జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో రూ. 6,379 కోట్లకు తగ్గాయి. కానీ, నెట్‌‌ ఎన్‌‌పీఏలు మాత్రం  రూ. 1,737 కోట్ల నుంచి రూ. 1,749 కోట్లకు పెరిగాయి. కోటక్ బ్యాంక్  మొత్తం ప్రొవిజన్లు క్యూ1 లో రూ. 8.80 కోట్లకు తగ్గడం విశేషం. కిందటేడాది  జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ. 858.67 కోట్లను ప్రొవిజన్ల కోసం బ్యాంక్‌‌ కేటాయించింది. 

బంధన్ బ్యాంక్‌‌‌‌

బంధన్ బ్యాంక్ నికర లాభం జూన్ క్వార్టర్‌‌‌‌లో ఏకంగా 137 శాతం ఎగిసి రూ. 886.5 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్‌‌కు రూ. 373.1 కోట్ల నష్టం రావడం గమనించాలి. బంధన్ బ్యాంక్‌‌కు క్యూ1లో  రూ. 2,514.4 కోట్ల  వడ్డీ ఆదాయం వచ్చింది. ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ. 2,114 కోట్లుగా ఉంది. బ్యాంక్ అడ్వాన్స్‌‌లు ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 96,649.7 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో 8.18 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది.

యెస్ బ్యాంక్‌‌‌‌

దివాలా అంచుల వరకు వెళ్లి తిరిగి కోలుకుంటున్న యెస్ బ్యాంక్ మెప్పిస్తోంది. ఎస్‌‌బీఐ కంట్రోల్‌‌ చేస్తున్న ఈ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో ఏకంగా 54 శాతం పెరగడం విశేషం. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో  రూ. 206.84 కోట్ల లాభాన్ని (స్టాండ్ ఎలోన్‌‌) ప్రకటించిన యెస్ బ్యాంక్‌‌, ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌ గాను రూ. 310.63 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌లో వచ్చిన రూ. 367.46 కోట్లతో పోలిస్తే మాత్రం యెస్ బ్యాంక్ ప్రాఫిట్ క్యూ1 లో తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే యెస్ బ్యాంక్‌‌కు క్యూ1 లో రూ. 314.14 కోట్ల నికర లాభం వచ్చింది. అదే నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరిగి రూ. 1,850 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ అడ్వాన్స్‌‌లు కూడా  జూన్ క్వార్టర్‌‌‌‌లో పెరిగాయి. బ్యాంక్ వడ్డీ యేతర ఆదాయం 10.1 శాతం తగ్గి రూ. 781 కోట్లుగా నిలిచింది. బ్యాంక్ ప్రొవిజన్లు క్యూ1 లో 60 శాతం తగ్గి రూ. 175 కోట్లుగా నమోదయ్యాయి. కాగా, బ్యాంక్‌‌ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో మాత్రం ఇంకా  హై లెవెల్‌‌లోనే (13.4 శాతం) ఉంది.