
- ఉప్పు వినియోగంపై ICMR ఆందోళన,అధ్యయనం
- అధిక సోడియం వినియోగంతో తీవ్రనష్టం
- ప్రతి వ్యక్తి రోజుకు తినాల్సిన ఉప్పు 5 గ్రాములే
- ప్రతి వ్యక్తి రోజుకు 9.2 గ్రాముల ఉప్పు తింటున్నారు
మనం దేశంలో ప్రజలు అధిక మొత్తం ఉప్పును తింటున్నారు. ఈ విషయంపై స్వయంగా భారత వైద్య పరిరక్షణసంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు ఉప్పు కారణమంటోంది. ఉప్పు అధికంగా తింటే ఆరోగ్యపరంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్జ్ (ICMR). ఈ సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర అధ్యయనాన్ని కూడా ప్రారంభించింది. పూర్తి వివరాల్లో వెళితే.
భారతదేశంలో ప్రజలు అధిక మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నారని ICMR తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది హైపర్‌టెన్షన్ , గుండె జబ్బులు, స్ట్రోక్ ,కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ICMR ఓ సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించింది.
ICMR అధ్యయనం వివరాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సుల మేరకు ప్రతి వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలి. అయితే భారతీయులు WHO సూచించిన దానికంటే రెట్టింపు ఉప్పుని వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐసీఎంఆర్. ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
ICMR అధ్యయనం ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లోని భారతీయులు సగటున రోజుకు 9.2 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. ఇది WHO సిఫార్సు చేసిన దానికంటే దాదాపు రెట్టింపు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సగటున 5.6 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. ఇది కూడా సిఫార్సు చేసిన పరిమితిని మించిపోయింది.
ఉప్పు ఎక్కువ తింటే..
అధిక సోడియం తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్, స్ట్రోక్, గుండె జబ్బులు ,కిడ్నీ సంబంధిత జబ్బులు పెరిగే ప్రమాదం అధికంగా ఉందంటున్నా ICMR-NIEలోని అధ్యయనానికి ప్రధాన పరిశోధకుడు డాక్టర్ శరణ్ మురళి.
ICMR-NIE జోక్యం, అధ్యయనం..
ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి ICMR-NIE మూడేళ్లపాటు పరిశోధనలు చేయనుంది. ప్రస్తుతం 2024లో పంజాబ్ ,తెలంగాణ రాష్ట్రాలలో ప్రారంభించింది. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల దగ్గర ఆరోగ్య కార్యకర్తలు అందించే నిర్మాణాత్మక ఉప్పు తగ్గింపు కౌన్సెలింగ్, రక్తపోటు ,సోడియం వినియోగాన్ని తగ్గించడంలో ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందో అంచనా వేస్తుంది. ఇది ముఖ్యంగా హైపర్‌టెన్షన్ ఉన్న వ్యక్తులపై దృష్టి పెడుతోంది.
అధ్యయన ఎలా జరుగుతుందంటే..
ప్రస్తుతం మొదటి సంవత్సరం పరిశోధనలు సాగుతున్నాయి. బేస్‌లైన్ అసెస్‌మెంట్‌లపై దృష్టి సారించింది ICMR. కౌన్సెలింగ్ మెటీరియల్‌ను స్థానిక ఆరోగ్య కార్యకర్తలతో కలిసి రూపొందిస్తున్నారు. వారి అనుభవాలు ,సూచనలను రికార్డు చేస్తారు. ఇది కేవలం ఆరోగ్య విద్యను అందించడం మాత్రమే కాదు, వినడం, అర్థం చేసుకోవడం ,కలిసి పనిచేయడం కూడా ముఖ్యమని డాక్టర్ మురళి నొక్కి చెబుతున్నారు.
తక్కువ సోడియంకు ప్రత్యామ్నం ఉందా..
సోడియం క్లోరైడ్‌ను పాక్షికంగా పొటాషియం లేదా మెగ్నీషియంతో భర్తీ చేసే తక్కువ సోడియం ఉప్పు ప్రత్యామ్నాయాలు రక్తపోటును సగటున 7/4 mmHg తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. అయితే చెన్నైలో నిర్వహించిన మార్కెట్ సర్వేలో తక్కువ సోడియం ఉప్పు రిటైల్ దుకాణాలలో కేవలం 28శాతం మాత్రమే అందుబాటులో ఉందని తేలింది. సూపర్ మార్కెట్లలో 52శాతం లభ్యత ఉండగా, చిన్న కిరాణా షాపులలో కేవలం 4శాతం మాత్రమే ఉందని పరిశోధనల్లో తేలింది.
అవగాహన కార్యక్రమాలు:
ICMR-NIE ప్రజలలో అవగాహన పెంచడానికి #PinchForAChange అనే ప్రచారాన్ని ట్విట్టర్ (ఇప్పుడు X) ,లింక్‌డిన్‌లలో ప్రారంభించింది. ఇన్ఫోగ్రాఫిక్స్ ,సాధారణ మేసేజ్ లను ఉపయోగించి ఉప్పు వనరులలో సోడియం కంటెంట్ గురించి అవగాహన కల్పించడం, ఆహార మార్పులను ప్రోత్సహించడం ,ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తోంది ICMR.
ఉప్పు వినియోగంపై పరిశోధనలు.. ముఖ్య ఉద్దేశ్యం:
ఈ అధ్యయనం భారతీయులలో అధిక ఉప్పు వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించి, వాటిని పరిష్కరించడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందిస్తుంది.