ఆగస్టు నెలలో పెరిగిన ఫ్లైట్​ జర్నీలు

ఆగస్టు నెలలో పెరిగిన ఫ్లైట్​ జర్నీలు

ముంబై: ఈ ఏడాది ఆగస్టు నెలలో డొమెస్టిక్​ ఎయిర్​ పాసింజర్​ ట్రాఫిక్​ 23 శాతం పెరిగి 1.24 కోట్లకు చేరినట్లు క్రెడిట్​ రేటింగ్​ ఏజన్సీ ఇక్రా ఒక రిపోర్టులో వెల్లడించింది. కొవిడ్ ​ముందుతో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువని పేర్కొంది. సెక్వెన్షియల్​గా చూస్తే జులై నెలలో ఈ గ్రోత్​ 3.2 శాతమేనని, ఆ నెలలో 1.21 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారని ఇక్రా రిపోర్టు తెలిపింది. ఆగస్టు నెలలో కెపాసిటీ డిప్లాయ్​మెంట్​ కూడా 10 శాతం అధికమైనట్లు వివరించింది. ఏవియేషన్​ ఇండస్ట్రీ గ్రోత్​ నిలకడగా ఉంటుందని తన అవుట్​లుక్​ను ప్రకటించింది. దేశంలోని చాలా రూట్లలో డొమెస్టిక్​ పాసింజర్​ ట్రాఫిక్​ వేగంగా రికవరయినట్లు తెలిపింది. ఇదే ట్రెండ్​ రాబోయే నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్​లైన్స్​ కంపెనీల ఆదాయాలు కూడా మెరుగయ్యాయని ఇక్రా రిపోర్టు వెల్లడించింది. ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయల్​ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి తక్కువగా ఉండటం ఈ ఇండస్ట్రీకి కలిసి వస్తోందని వివరించింది.

ఏటీఎఫ్​ నెలవారీ పెరుగుదల కొంత ఎక్కువగానే ఉంటోందని, దీని ఎఫెక్ట్​ ఇండస్ట్రీపై పడుతుందని పేర్కొంది. ఏటీఎఫ్​ రేట్ల పెరుగుదల తట్టుకోవడం ఒక సవాలేనని అభిప్రాయపడింది. ఏవియేషన్​ఇండస్ట్రీ రెవెన్యూ నిలకడ సాధించేందుకు మరికొంత టైము పడుతుందని పేర్కొంది. 2022–23 లో ఏవియేషన్​ ఇండస్ట్రీ రూ. 17 వేల కోట్ల దాకా నష్టాలపాలైనట్లు ఇక్రా అంచనా వేసింది. అయితే, అంతకు ముందు ఏడాదిలోని రూ. 22 వేల కోట్లతో పోలిస్తే అది తక్కువేనని వివరించింది. పాసింజర్ల గ్రోత్​ మెరుగవడంతో  ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో ఎయిర్​లైన్స్​ నష్టాలు రూ. 5 వేల కోట్లకు మించకపోవచ్చని వెల్లడించింది.