‘’అరేయ్.. ఏందిరా.. పోరా..’’ కరీంనగర్ లో ఓ డాక్టర్ బూతు దండకం

‘’అరేయ్.. ఏందిరా.. పోరా..’’ కరీంనగర్ లో ఓ డాక్టర్ బూతు దండకం

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపలేదు

తిట్టి బయటకు వెళ్లగొట్టిండు

ప్రైవేటు దవాఖానాల్లో కూడా పట్టలే

జగిత్యాల హాస్పిటల్ ప్రాణం పోసింది!

ప్రజలందరూ సమానమేనని, ఎవరినీ తక్కువ ఎక్కువ చూడకూడదని రాజ్యాంగం చెప్పిం ది. అందరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ చాలాచోట్ల, చాలామంది ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. చదువురాని వారని, కులం తక్కువ వారని, ఏమీ తెలియని వారని చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. వారిని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా ఇష్టమున్నట్టు బూతులు తిడుతూ ఛీత్కరిం చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో జరిగింది. ప్రాణం పోయే స్థితిలో దవాఖానాకు వస్తే ట్రీట్ మెంట్ ఇవ్వాల్సింది పోయి..నిర్ధా క్షిణ్యం గా వెళ్లగొట్టిన మానవత్వం లేని ఓ డాక్టర్ కథ ఇది. ఏందిరా..పోరా..అరేయ్ మీదనుం చి దిగని ఓ వైద్యుడి వ్యవహారం ఇది. ఆలస్యం గా వెలుగు చూసిన ఈ ఘటన మళ్లీ ఒకసారి వ్యక్తి, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది.

చట్టం, న్యాయం ముందు అందరూ సమానమే. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. దీనికి భంగం కలిగించిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆర్టికల్ 14 చెప్తోంది. మతం, రంగు , కులం, ఆడా, మగా, పుట్టిన స్థలం ఆధారంగా ఎవరినైనా తక్కువగా చూసినా, వారికి అందాల్సిన హక్కులు సేవలను నిరాకరించినా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం శిక్షార్హులు.

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన రాజ్ కుమార్. వడ్డెర కులా నికి చెందిన వాడు. ఇతడు గుంతలు తవ్వడం, బండలు కొట్టడం చేస్తుంటాడు. పని చేసుకుంటేనే రోజు గడిచేది. ఓ గుడిసెలో ఉంటాడు. పెళ్లయి 10 నెలల పాప ఉంది . భార్య భర్తల మధ్య వచ్చిన మనస్థర్థల కారణంగా జూలై 31 సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాయికల్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకుపోయారు. పరిస్థితి వెంటిలేటర్ అవసరం ఉండడంతో కరీంనగర్ విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు కరీంనగర్ తీసుకువెళ్లాలని సూచించారు.

బాంచెన్ ..కాల్మొక్తం..బతికియ్యిర్రి

వెంటిలేటర్ అవసరం ఉండడంతో కరీంనగర్ లో నైనా తమవాడి ప్రాణాలు దక్కుతా యని ఆశించారు రాజ్ కుమార్ వెంట ఉన్న అతడి​ తల్లి, మామ. అప్పటికే టైం 11:30 అవుతోంది. సివిల్ హాస్పిటల్ కు వెళ్లాక సెక్యూరిటీ గార్డులు వచ్చి చూసి ఇద్దరు అటెండర్లను లోపలికి పంపారు. అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ కు పరిస్థితి వివరించారు. ‘ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు. కేవలం కరోనాకు మాత్రమే వెంటిలేటర్ , ఆక్సిజన్ సౌకర్యం ఉంది . బయటి పేషెంట్లకు లేవు. మీరు వెళ్లిపోండి. వరంగల్ తీసుకుపోండి ’ అని సమాధానం ఇచ్చాడు. దీనికి వారు ‘మేము చాలా దూరం నుంచి వచ్చినం సార్ . బాంచె న్ . కాల్మొక్తం. మాకు ఇక్కడ తప్పితే వేరే మార్గం లేదు. ఎట్లన్న చేసి బతికియ్యిర్రి’ అని బతిమిలాడారు. దీంతో ఆగ్రహించి న డాక్టర్ ‘చెప్తే ఇనవడుత లేదారా పాగల్ . వెళ్లిపొమ్మంటే తలకాయకు ఎక్కు త లేదా ? ఎన్ని సార్ల చెప్పాలె’ అని తిట్టాడు. ఆడ మనిషి ఉందన్న సంగతి కూడా పట్టించుకోలేదు. అట్ల తిడుతున్నరేంది సార్. డాక్టరై ఉండి గిట్ల తిట్టుడేంది . మంచిగ మాట్లాడుర్రి. అని అనడంతో ఆ డాక్టర్ ఊగిపోయిండు. ‘అరేయ్ దేడ్ దిమాక్ నువ్వు నాకు చెప్పుడేందిరా . బయటకు నడువ్ ’ అంటూ వెళ్లగొట్టాడు.

ప్రైవేట్ అంబులెన్స్​లో మరో 4 దవాఖానాలకు..

రాయికల్ నుంచి వచ్చిన అంబులెన్స్​ డ్రైవర్ వెళ్లిపోతా అనడంతో వారు అక్కడే ఓ ప్రైవేట్ అంబులెన్స్​ మాట్లాడుకుని అందులోకి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి నాలుగు ప్రైవేట్ దవాఖానాలకు తిరిగారు. ఎక్కడికి పోయినా అదే సమాధానం. కనీసం పేషెంట్ ను కూడా చూడకుండా పేషెంట్ వెంబడి వచ్చిన వారిని చూసే వెళ్లగొట్టారు. ఇలా సుమారు రాత్రి ఒకటిన్నర వరకు దవాఖానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ప్రాణం పోసిన జగిత్యాల దవాఖాన

చివరికి ఏదైతే అదవుతుందిలే అనుకుని అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి జగిత్యాల దవాఖానాకు తీసుకువచ్చారు. స్పందించిన జగిత్యాల డాక్టర్లు వారిని అడ్మిట్ చేసుకుని ఆక్సిజన్ పెట్టి ట్రీట్ మెం ట్ స్టార్ట్ చేశారు. డాక్టర్లు శ్రద్ధ పెట్టడంతో ఆ యువకుడు మెల్లమెల్లగా కోలుకున్నాడు. కొన ఊపిరి తో కొట్టుమిట్టాడిన రాజ్ కుమార్ ఆదివారం ప్రాణాపాయం నుంచి బయటపడి మాట్లాడుతున్నాడు.

పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్

కరీంనగర్ దవాఖానాలో ట్రీట్ మెంట్ అందక జగిత్యాల హాస్పిటల్ లో కోలుకున్న రాజ్ కుమార్ విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. పేదవాళ్లు కావడంతో అతడికి ఆర్థిక సాయం చేశారు.

ఏం జరిగిందో కనుక్కుంటా…

రాజ్ కుమార్ అనే పేషెంట్ ను దవాఖానా నుంచి వెళ్లగొట్టిన విషయం తెలియదు.ఆరోజు ఆ పేషంట్ వచ్చారా లేదా అన్నది కనుక్కుంటా . వచ్చినవారు ఎవరైనా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందే. ఎవరు తక్కువ , ఎక్కువ ఉండదు. అందరూ సమానమే. ఆరోజు ఏం జరిగిందో డ్యూటీ డాక్టర్ ను అడిగి తెలుసుకుంటా. తప్పు చేశారని తెలిస్తే చర్యలు తీసుకుంటా. – రత్నమాల, దవాఖానా సూపరింటెండెంట్

ఎవరినీ తిట్టలేదు

అర్ధరాత్రి పూట పేషెంట్ ను తీసుకుని వచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ముందు మా సిబ్బంది చూశారు. అతడి పరిస్థితి సీరియస్ గా ఉండడం, అప్పటికే దవాఖానాలో ఆక్సిజన్ బెడ్లు పూర్తిగా నిండిపోవడంతో ట్రీట్ మెంట్ సాధ్యం కాదని చెప్పా. కానీ పేషెంట్ అటెండర్స్​ను తిట్టలేదు. ఇబ్బందులకు గురి చేయలేదు.– డా.హరీష్, డ్యూటీ డాక్టర్, సివిల్ హాస్పిటల్, కరీంనగర్.

మేం మనుషులం కాదా?

మా అల్లుడు ఉరేసుకున్నందుకు రాయికల్ తీస్కపోయినం. అక్కడి నుంచి కరీంనగర్ పోయినం. ఎక్కడికి పోయినా మాలాంటి పేదోళ్లంటే అలుసే కదా. అక్కడున్న డాక్టర్ మమ్ములను జాయి న్ చేసుకొమ్మం టే ఇష్టం వచ్చినట్లు తిట్టిండు…కనీసం ట్రీట్ మెం ట్ ఇమ్మంటే కూడా వినిపించుకోలే. ప్రైవేట్ కు పోయినా అట్లనే చేసిన్రు. చిన్న కులపోళ్లకు బతికే హక్కులేదా?  – గంగాధర్, పేషెంట్ మామ

జగిత్యాల డాక్టర్లు దేవుళ్ళు

మా గోస ఆ దేవునికే ముట్టింది. రాయికల్, కరీంనగర్ తిరిగినం. ఆడ డాక్టర్ తిట్టుడుకు మేం గూడా సగం సచ్చినం. అప్పు సప్పు చేసి బతికించుకుందామని ప్రైవేట్ దవాఖానాలకు కూడా తీసుకుపోయినం. అక్కడ కూడా పట్టలే . ఇగ ఏదైతే అది అయితదని జగిత్యాలకు తీసుకువచ్చినం. ఇక్కడి డాక్టర్లు దేవుళ్ల లెక్క నా కొడుక్కు ప్రాణం పోసిన్రు. అంతా సల్లంగుండాలె. – చిన్న గంగు, పేషెంట్ తల్లి.