Idli Kadai Movie Review: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' రివ్యూ: గుండెను తాకే ఫ్యామిలీ డ్రామా! మూవీలో ప్లస్సులు, మైనస్సులు ఇవే!

Idli Kadai Movie Review: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' రివ్యూ: గుండెను తాకే ఫ్యామిలీ డ్రామా! మూవీలో ప్లస్సులు, మైనస్సులు ఇవే!

తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'ఇడ్లీ కడై'. దసరా సందర్భంగా ఈ మూవీ ఈ రోజు (  అక్టోబర్ 1, 2025)  థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.  ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో విడుదల చేశారు. 'కుబేర' మూవీతో ఈ కోలీవుడ్ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమాలో  ధనుష్  నటించడమే కాకుండా, రచయిత, దర్శకుడిగా, తన వండర్‌బార్ ఫిలింస్ బ్యానర్‌పై డాన్ పిక్చర్స్ భాగస్వామ్యంతో సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు.  ఇందులో నిత్యా మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, ఆర్. పార్థిబన్, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడిగా ధనుష్‌కు ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. ఈ ఫ్యామిలీ డ్రామా హిట్టా.. ఫట్టా..? ప్రేక్షకులు స్పందన ఎలా ఉందో చూద్దాం.. 

కథాంశం

శంకరాపురం అనే గ్రామంలో శివకేశవ (రాజ్ కిరణ్) నడుపుతున్న ఇడ్లీ కొట్టు చాలా ప్రసిద్ధి చెందింది. అతని కొడుకు మురళి (ధనుష్) మాత్రం పల్లెటూరి జీవితం వద్దనుకొని, హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, మెరుగైన ఉద్యోగం కోసం ఆరేళ్లు కుటుంబాన్ని వదిలి బ్యాంకాక్‌కు వెళ్తాడు. అక్కడ తన కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా ఈ సమయంలో శివకేశవ మరణించడంతో మురళి సొంతూరికి వస్తాడు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని, కుటుంబాన్ని మురళి ఎలా నిలబెట్టాడు, విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)తో అతనికి గొడవలు ఎందుకు వచ్చాయి అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే?

కథ పాతదే అయినా, ఈ సినిమాలో ఎమోషన్స్ బలంగా పండాయి. ఉద్యోగాల కోసం ఊళ్లను వదిలి వెళ్లిన చాలామందికి ఈ సినిమా తల్లిదండ్రులు, మట్టితో అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా, కొడుకును గుర్తుపట్టని తల్లి (నిత్యామేనన్) సీన్ గుండెల్ని పిండేస్తుంది. అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా ధనుష్ తన ప్రతిభను చూపారు. ధనుష్‌కి ఇలాంటి అండర్ ప్లే పాత్రలు చేయడం కొత్తేమీ కాదు, మురళిగా అతని నటన అద్భుతం. కల్యాణిగా నిత్యామేనన్, అశ్విన్‌గా అరుణ్ విజయ్ పోటీపడి నటించారు. రాజ్ కిరణ్ సహజంగా కనిపించారు. సత్యరాజ్, సముద్రఖని, పార్తిబన్ వంటి సీనియర్ నటుల పాత్రలు పరిమితంగా ఉన్నాయి.

సినిమా నిడివి ఎక్కువ అనిపించినా, ఒక్కసారి కథలోని ఎమోషన్‌కి కనెక్ట్ అయితే కన్నీళ్లు రావడం ఖాయం. పదే పదే వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే, కథనం సరళంగా ఉండటం, కొన్ని మలుపులు ముందుగానే ఊహించే విధంగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సాంకేతిక అంశాలు 

జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం (BGM) బాగున్నా, పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ మాత్రం రిచ్‌గా, గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది. నటుడిగా ధనుష్ ఫుల్ మార్కులు సాధించినా, దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల కథనాన్ని సాగదీశారనే భావన కలుగుతుంది. డబ్బింగ్ బాగా కుదిరింది. ఓవరాల్‌గా, కుటుంబ కథా చిత్రాలు, బలమైన భావోద్వేగాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'ఇడ్లీ కడై' కచ్చితంగా నచ్చుతుంది. పండుగ రోజుల్లో కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా ఇది

సినిమాపై అభిమానుల రివ్యూలు

సినిమా చూసిన అభిమానుల తమ అభిప్రాయంతో సోషల్ మీడియా హోరెత్తిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తోంది చాలా మంది ప్రేక్షకులు ముఖ్యంగా సెంకడ్ హాఫ్  భావోద్వేగంతో ఆకట్టుకుంటుందని, ఇది హృదయాన్ని తాకే కుటుంబ వినోదభరిత చిత్రం (Heartwarming Family Entertainer) అని కితాబిచ్చారు. అయితే, మరికొందరు మాత్రం స్క్రీన్‌ప్లేను అంతగా మెచ్చుకోలేదు, కథనం మందకొడిగా ఉందని అభిప్రాయపడ్డారు. కొందరి అభిప్రాయం ప్రకారం, కొన్ని పాత్రల నటన పూర్తి స్థాయిలో కుదరలేదని, సినిమా వేగం అసాధారణంగా (Pacing was strange) ఉందని వ్యాఖ్యానించారు.

ఒక నెటిజన్: "@dhanushkraja ఇడ్లీ కడైలో గ్రేవీతో కూడిన ధైర్యాన్ని అందించారు—ఆకలి, కష్టపడే తత్వాన్ని కలిపే కథ ఇది. వీధి ఆవిరి నుండి తెరపైకి వచ్చిన ఈ డ్రీమ్, ప్రతి సీన్ లోనూ ఎమోషన్‌ను రేకెత్తిస్తుంది అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మరొక అభిమాని: "#IdliKadai ఫస్ట్ హాఫ్ - #GVPrakashKumar తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. ఈ సినిమా కోసం ఆయనే సరిగ్గా సరిపోతారు. @gvprakash సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు అందం తెచ్చింది... దీన్ని మరెవరూ ఇంత బాగా చేయలేరనుకుంటా." అని పోస్ట్ చేశారు.

ఇంకొకరు: "#IdliKadai 4.25/5 నాతో బాగా కనెక్ట్ అయింది. సెకండ్ హాఫ్‌లో ఈగల్ సీన్ = గూస్‌బంప్స్. సినిమా మొత్తం మురుగన్ ఇడ్లీ కడై చుట్టూ తిరుగుతుంది. దర్శకుడిగా, నటుడిగా #Dhanush విజయం సాధించారు. ఆయన 2 నిమిషాల ప్రసంగం నిజ జీవితం నుండి వచ్చినట్లు అనిపించింది. ఈ చిత్రం పల్లెటూరి జీవితం గురించి చెబుతోంది."

ఈ చిత్రంలో ధనుష్ కష్టపడే ఒక పల్లెటూరి వంటవాడి పాత్రలో ఒదిగిపోయారని, ఇది గ్రిట్ , భావోద్వేగాల కలబోత అని ప్రశంసిస్తున్నారు. చాలా కాలం తర్వాత నెగటివ్ పాత్రలో కనిపించిన అరుణ్ విజయ్ విలన్ పాత్ర అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య పోరాట ఘట్టాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

బాక్సాఫీస్ వద్ద పండుగ సందడి

'ఇడ్లీ కడై' ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ ఏడాది భారతదేశంలో అత్యుత్తమ తమిళ సినీ ఓపెనర్లలో ఇది ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. నవరాత్రి పండుగ షెడ్యూల్ ,ధనుష్ అభిమాన బృందం సృష్టించిన ఉత్సాహం ఈ సినిమాకు కలిసి వచ్చింది. బలమైన 'వర్డ్ ఆఫ్ మౌత్' కారణంగా, ముఖ్యంగా గ్రామీణ, కుటుంబ ప్రేక్షకులలో 'ఇడ్లీ కడై' పండుగ సీజన్‌లో అద్భుతమైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధనుష్ తన రచనా, దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాడనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.