ఆప్​కు అధికారం ఇస్తే ఢిల్లీ మోడల్ పాలన

ఆప్​కు అధికారం ఇస్తే ఢిల్లీ మోడల్ పాలన
  • హిమాచల్​లోనూ ఢిల్లీ మోడల్​ పాలన
  • ఆప్​ కన్వీనర్​ కేజ్రీవాల్​ హామీ

కంగ్రా: ఐదేండ్ల పాలనలో ఢిల్లీలోని 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చామని, అవినీతిని అంతం చేశామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేషనల్​ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ చెప్పారు. ఆప్​కు అధికారం కట్టబెడితే హిమాచల్​ ప్రదేశ్​లో కూడా ఢిల్లీ మోడల్​ పాలన తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం హిమాచల్ ప్రదేశ్​లోని కంగ్రాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘నయా హిమాచల్​ను తయారుచేసే సమయం వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్​లోని మంచి నేతలందరూ ఆ పార్టీలను విడిచి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రజలు ఆప్​కు ఒక చాన్స్ ఇవ్వాలని కోరుతున్నా” అని చెప్పారు. 
హిమాచల్, గుజరాత్​లో ప్రజల వ్యతిరేకతను చూసి భయపడుతున్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సామాన్యుడి చేతికే అధికారం వస్తుందన్నారు. ఆప్ సర్కారు ఢిల్లీ మోడల్.. తమ రాష్ట్రంలో పని చేయదన్న హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ కామెంట్లపైనా కేజ్రీవాల్ స్పందించారు. 
సీఎం ఠాకూర్ ముందుగా ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూళ్లను సందర్శించాలన్నారు. హిమాచల్​ను పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రెండూ దోపిడీ పాలన సాగించాయన్నారు. ఇటీవల 125 యూనిట్ల ఫ్రీ కరెంట్​ను ప్రకటించిన హిమాచల్ బీజేపీ సర్కారు.. ఎన్నికలు అయిపోగానే దీనిని ఎత్తేస్తుందన్నారు. ఈ స్కీంను ప్రకటించిన వెంటనే జైరాం ఠాకూర్​కు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ఫోన్లు వచ్చాయని, దీంతో ఎన్నికల తర్వాత దీనిని ఆపేస్తానని ఆయన చెప్పారన్నారు.