రూ. 7298 కోట్లతో 26వేల సర్కార్ స్కూళ్ల అభివృద్ధి

రూ. 7298 కోట్లతో 26వేల సర్కార్ స్కూళ్ల అభివృద్ధి
  • ప్రభుత్వ స్కూళ్లలో మన ఊరు, మన బడి, మన బస్తీ
  • స్థానిక ప్రజా ప్రతినిధులకు  భాగస్వామ్యం
  • ప్రత్యేక అకౌంట్లు తెరచి పారదర్శకంగా నిధులు వినియోగం
  • కార్పొరేట్ను మించి అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సర్కార్ స్కూళ్లను కార్పొరేట్ను మించి అభివృద్ధి చేయాలన్న కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని..ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులకు  భాగస్వామ్యం ఉంటుందన్నారు. ప్రత్యేక అకౌంట్లు తెరచి పారదర్శకంగా నిధులు వినియోగం చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. 
మంగళవారం మన ఊరు మన బడి,మన బస్తీ మన బడి కార్యక్రమం పై  వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి,పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళికృష్ణ, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా విద్యాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిని మించి అభివృద్ధి పర్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సబ్ కమిటీలో చర్చించి ఈ కార్యక్రమ కార్యాచరణ చేపట్టడటం జరిగిందన్నారు. మూడు దశల్లో 7298.54 కోట్లతో 22 లక్షల మంది విద్యార్థులు చదివే 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి విడత లో 3500 కోట్ల వ్యయం తో 60 శాతం మంది విద్యార్థులు చదివే 35 శాతం ( 9123) పాఠశాలల ఎంపిక చేశామని, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలోభాగస్వామ్యం చేయాలన్నారు. రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరిచి,పారదర్శకంగా నిధుల ఖర్చు చేయాలన్నారు. అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుందని, ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ లో పొందుపరచటం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ముందుగా విద్యా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని చేపట్టాల్సిన పనుల కోసం తీర్మానాలు చేయాలన్నారు. 
అందరిలో ప్రభుత్వ బడి మనది అన్న భావన రావాలి
ప్రభుత్వ బడి మనది అన్న భావన అందరిలో రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 371 పాఠశాలలు ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలకు రూ.కోటి విరాళమిస్తే.. సదరు స్కూలుకు వారి పేరు పెడతామని ఆమె వెల్లడించారు. మన ఊరు, మన బస్తీ, మన స్కూలు కార్యక్రమంలో భాగంగా 12 అంశాలలో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఒకే  ప్రాంగణంలో జూనియర్ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో  ఎక్కడికి వెళ్లిన రాణించేలా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు నూతన శోభ చేకూరిందని, ప్రస్తుతం పాఠశాలల అభివృద్ధి మరో  కలికితురాయి అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని, అందరూ విజయవంతానికి కృషి చేయాలని మంత్రి సబిత కోరారు. 

 

ఇవి కూడా చదవండి

రైల్వేల ప్రైవేటీకరణపై వరుణ్ గాంధీ ఆసక్తికర కామెంట్స్

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’