పాక్‌కు బుద్ది రావడంలేదు.. ఇండియా జోలికొస్తే చావుదెబ్బ తప్పదు

పాక్‌కు బుద్ది రావడంలేదు.. ఇండియా జోలికొస్తే చావుదెబ్బ తప్పదు

భారతదేశం సుసంపన్నమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యుద్దాన్ని , దాడులను ఎన్నడూ కోరుకోదని చెప్పారు. గతంలో ఇండియాపై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి కానీ.. ఇండియా మరే దేశంపైనా దాడి చేసిన దాఖలాలు లేవన్నారు. భారత్ ను ఎవరైనా దెబ్బకొట్టాలని చూస్తే మాత్రం.. వారికి చావుదెబ్బ తప్పదని చెప్పారు. భారత్ పై దాడి చేయడానికి ఎవరు ప్రయత్నించినా… వారు జీవితంలో మరిచిపోలేని దెబ్బతింటారని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.

విశాఖపట్నంలో NSTLకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రతిభ చూపిన సైంటిస్టులు, అధికారులను సత్కరించారు. దేశరక్షణ పరికరాల తయారీలో ఎన్ఎస్టీఎల్ పాత్రను కొనియాడారు. మనిషి చంద్రమండలంలోకే కాకుండా సూర్యమండలంలోకి కూడా అడుగుపెడతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు వెంకయ్యనాయుడు. వేరే దేశాల అంతర్గత అంశాల జోలికి భారత్ వెళ్లదనీ.. ఇతర దేశాలు కూడా భారత అంతర్గత విషయాల జోలికి రాకపోవడం మంచిదని సూచించారు. మానవత్వం, మనుషులకు, తమ సొంత దేశానికి కూడా ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయకుండా.. పొరుగునున్న పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. దానికి వాస్తవం ఇంకా అర్థం కావడం లేదని చెప్పారు వెంకయ్య.

పురాతన నాగరికతకు, శాంతిని కోరే దేశానికి భారతదేశం ఒక చిహ్నమని చెప్పారు వెంకయ్య. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా వుండేదని మళ్లీ ఆరోజులు రాబోతున్నాయన్నారు. విదేశీభావజాలం నుంచి భారతీయులు బైటపడాలన్నారు. భారత్ కు ఎవరపైనా దాడి చేసే స్వభావంలేదని, ఇతరులు మన సొంత విషయాలజోలికి వస్తే గట్టిగానే బుద్ది చెపుతామన్నారు.