డ్రంకెన్​ డ్రైవ్​లో దొరికితే..కుటుంబ సభ్యుల ముందే క్లాస్

డ్రంకెన్​ డ్రైవ్​లో దొరికితే..కుటుంబ సభ్యుల ముందే క్లాస్
  • పట్టుబడిన వారికి ఫ్యామిలీ మెంబర్స్​ ముందే క్లాస్
  • బిగ్ స్క్రీన్​ లో షార్ట్ ఫిల్మ్స్​ చూపిస్తున్న పోలీసులు

ఖమ్మం, వెలుగు: లిక్కర్​ తాగి బండ్లు నడిపే వారిపై పోలీసులు ఫోకస్​ పెడుతున్నారు. డ్రంకెన్​ డ్రైవ్​ నివారణకు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ఎవరైనా తాగి పట్టుబడితే ఫ్యామిలీ మెంబర్స్​ ముందే వాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తాగి డ్రైవ్ చేసే వారిలో మార్పు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. వారానికి రెండు సార్లు ఇలా కౌన్సెలింగ్ ఇస్తున్నా, ప్రతీ సారి కొత్తవాళ్లు పట్టుబడుతూనే ఉన్నారు. యావరేజీగా ఖమ్మం జిల్లాలో రోజుకు 15 మంది డ్రంకెన్​ డ్రైవ్ లో దొరుకుతున్నారు. ఈ నంబర్ ఏటా పెరుగుతోంది. 2019లో 2,361 మంది పట్టుబడగా, కొవిడ్ కారణంగా లాక్ డౌన్​ పెట్టడంతో 2020లో ఆ సంఖ్య 563కి తగ్గింది. మళ్లీ 2021లో 2,400 మంది తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. 
కౌన్సెలింగ్​తో మార్పు..
ఖమ్మం పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ఖమ్మం నగరంతో పాటు పట్టణాల్లోనే రెగ్యులర్​గా పోలీసులు డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు చేపడుతున్నారు. నగరంలో ప్రకాశ్​నగర్​ బ్రిడ్జి, డీఆర్డీఏ ఆఫీస్​, నెహ్రూ నగర్​ ఏరియాల్లో చెకింగ్స్​ చేస్తున్నారు. పట్టుబడుతున్న వారికి ప్రతి బుధవారం, శనివారం కౌన్సెలింగ్ ఇస్తుండగా, కనీసం 50 మంది మందుబాబులు, వారితో పాటు వచ్చిన మరో 50 మందికి షార్ట్ ఫిల్మ్ వీడియోలు చూపిస్తూ, మరోసారి తాగి బండి నడపకుండా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెహికల్ తో పట్టుబడిన సమయంలో కౌన్సెలింగ్ కు సంబంధించిన టైమ్​, ప్లేస్​ చెప్తున్నారు. తప్పనిసరిగా ఫ్యామిలీ మెంబర్​ను వెంట తీసుకురావాలని కండీషన్​ పెట్టడంతో కొందరు భార్యను, మరికొందరు అన్నను, ఇంకొందరు తల్లిదండ్రులను, ఫ్రెండ్స్​ను వెంటబెట్టుకొని వస్తున్నారు. ఇలా మరొకరి సమక్షంలో కౌన్సెలింగ్​ ఇవ్వడంతో మరోసారి పొరపాటు చేయకుండా చాలా మంది మారుతున్నారు.
షార్ట్​ ఫిల్మ్స్​తో అవగాహన..
మందుబాబులకు కౌన్సెలింగ్​లో భాగంగా ట్రాఫిక్​ పోలీసులు షార్ట్ ఫిల్మ్స్​ను చూపిస్తున్నారు. తాగి వాహనం నడిపి ఏదైనా జరగరానిది జరిగితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎలా బాధపడతారో తెలిపేలా సిద్ధం చేసిన వీడియోలను బిగ్ స్క్రీన్ పై చూపిస్తున్నారు. పిల్లలు అనాథలుగా మారడం, యాక్సిడెంట్స్ జరిగితే కుటుంబాలు వీధిపాలు కావడం వంటి వీడియోలు చూపడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చివరకు మళ్లీ డ్రంకెన్​ డ్రైవ్​ చేయబోమని వాళ్లతో ప్రమాణం చేయిస్తున్నారు. కౌన్సెలింగ్ తర్వాత వాళ్లను కోర్టులో ప్రొడ్యూస్​ చేస్తున్నారు. కోర్టులో మొదటి తప్పుగా గుర్తించి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు జరిమానా విధిస్తున్నారు. రిపీటెడ్ గా తప్పు చేస్తే జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. అయితే ఏడాదిలో 10 నుంచి 15 మంది మాత్రమే రెండోసారి తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్నారని, ఈ పర్సెంటేజీని కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రాఫిక్​ పోలీసులు చెబుతున్నారు. 
కౌన్సెలింగ్ మార్పు తెచ్చేలా ఉంది
మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. పోలీసులకు డ్రంకెన్​ డ్రైవ్ లో పట్టుబడిన తర్వాతే బీరు తాగుతాడని తెలిసింది. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన కౌన్సెలింగ్ కు నేను కూడా వెళ్లాను. వాళ్లు చూపించిన వీడియోలు, చేసిన కౌన్సెలింగ్ తో మా బాబులో మార్పు వచ్చింది. మళ్లీ ఆ తప్పు రిపీట్ చేయబోనని మాట ఇచ్చాడు. -గంధం వెంకట్రాజు, ఖమ్మం
రెండోసారి పట్టుబడితే సీరియస్​ యాక్షన్​
డ్రంకెన్​ డ్రైవ్​లో మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. రెండోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు చేయాలని ఆర్టీఏ ఆఫీసర్లకు లెటర్ పెడుతున్నాం. గతేడాది 14 మందికి సంబంధించి ఇలాగే లెటర్​ పెట్టాం. కోర్టులో కూడా రెండోసారి పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది.
- రామోజు రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ, ఖమ్మం
ఇంట్లో వాళ్లు పడే ఇబ్బంది చూపిస్తున్నం
నగరంలో రెగ్యులర్ గా డ్రంకెన్​ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. వారంలో రెండు సార్లు కౌన్సెలింగ్ చేస్తున్నాం. భవిష్యత్​లో కుటుంబ సభ్యులు ఎలా ఇబ్బంది పడతారో షార్ట్ ఫిల్మ్స్, వీడియోల ద్వారా అవేర్​నెస్​ కల్పిస్తున్నాం. ఒకసారి తప్పు చేసిన వాళ్లు మళ్లీ పొరపాటు చేయకుండా మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సత్ఫలితాలు వస్తున్నాయి. - అంజలి, ట్రాఫిక్​ సీఐ, ఖమ్మం