బాగా చదివితేనే ఉన్నత స్థానాలు చేరుకోవచ్చు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాగా చదివితేనే ఉన్నత స్థానాలు చేరుకోవచ్చు :  కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు: బాగా చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.  గురువారం నల్గొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పాఠశాల స్టోర్ రూమ్, వంటగది, పరిసరాలను పరిశీలించారు.  

అనంతరం భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా చదివితే భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో ఉంటారన్నారు.  ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలన్నారు.  అంతకు ముందు పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు.  

అనంతరం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం లైబ్రరీని పరిశీలించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌‌‌‌ కుమార్, పెద్దవూర తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈఓ రాము, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ శ్రీనివాస రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాల్స్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు. 

పెండింగ్ సదరం కేసులు పరిష్కరించాలి 

నల్గొండ అర్బన్, వెలుగు: పెండింగ్‌‌‌‌లో ఉన్న సదరం కేసులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం నల్గొండలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు.  సదరం క్యాంపులను ఆసుపత్రిలోని  పాత భవనంలో నిర్వహిస్తుండగా నూతన భవనంలోకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

  కొత్త భవనానికి సంబంధించిన పార్టిషన్, ఎలివేషన్ పనుల వల్ల శిబిరం మార్పు సాధ్యం కాలేదని డీఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  పెండింగ్‌‌‌‌లో ఉన్న 2,564 సదరం దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల నాటికి క్యాంపుల నిర్వహణ, పరిష్కారం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జీజీహెచ్‌‌‌‌ డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంఓ డాక్టర్ నాగేశ్ పాల్గొన్నారు.