నచ్చిన అమ్మాయి దొరికితే పెండ్లి చేసుకుంట: రాహుల్

నచ్చిన అమ్మాయి దొరికితే పెండ్లి చేసుకుంట: రాహుల్
  • ‘కర్లీ టేల్స్’ చానల్‌‌ ఇంటర్వ్యూలో కామెంట్స్

న్యూఢిల్లీ: తెలంగాణ వంటకాల్లో కారం కాస్త ఎక్కువేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘భారత్ జోడో యాత్రలో భాగంగా పలు రాష్ట్రాల వంటకాలు చూశాను. సంప్రదాయాల్లాగే ఆహారంలో చాలా వ్యత్యాసాలున్నాయి. తెలంగాణ వంటకాలు మాత్రం కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం కాస్త ఎక్కువ. ఆ స్థాయిలో నేను తినలేను” అని చెప్పారు. ఇటీవల ఫుడ్ అండ్ ట్రావెల్ చానల్ ‘కర్లీ టేల్స్’కు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో తన ఆహారపు అలవాట్లతోపాటు పెండ్లి గురించిన విషయాలను కూడా రాహుల్ పంచుకున్నారు. ‘‘ఇంట్లో ఉన్నప్పుడు డైట్ విషయంలో కఠినంగా ఉంటా. కానీ యాత్రలో అన్నీ ఉండవు కదా.. ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తా. కానీ బఠాణీ, పనసపండు నచ్చవు” అని చెప్పుకొచ్చారు. తాను నాన్‌‌ వెజిటేరియనేనని, చికెన్, మటన్, సీఫుడ్ తింటానని తెలిపారు. 

కాశ్మీరీ పండిట్లకు అన్యాయం

కాశ్మీరీ పండిట్లకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. పండిట్ కమ్యూనిటీకి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాంబా జిల్లాలో కాశ్మీరీ పండిట్ల ప్రతినిధుల బృందం.. రాహుల్​ను కలిసింది. టార్గెట్ కిల్లింగ్స్ సహా పలు సమస్యల గురించి ఆయనకు తెలియజేసింది.

ప్రేమించే.. తెలివైన అమ్మాయి అయితే ఒకే

నచ్చిన అమ్మాయి దొరికితే పెండ్లికి రెడీ అని రాహుల్ చెప్పారు. అయితే, దీనికి ఎలాంటి ‘చెక్ లిస్ట్’ లేదని.. ప్రేమించే, తెలివైన అమ్మాయి అయితే చాలని అన్నారు.  డిసెంబర్‌‌‌‌లో ఓ యూట్యూబ్ చానల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్.. తాను చేసుకోబోయే అమ్మాయికి తన తల్లి సోనియా గాంధీ.. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలో ఉన్న లక్షణాలు ఉండాలని చెప్పారు.

రఘునాథ్ ఆలయంలో పూజలు

సోమవారం సాంబా జిల్లా నుంచి జమ్మూలోకి రాహుల్ పాదయాత్ర ఎంటరైంది. పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత రఘునాథ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు.