కేసీఆర్ జై తెలంగాణ అనకుంటే తెలంగాణ వస్తుండెనా?: కేటీఆర్​

కేసీఆర్ జై తెలంగాణ అనకుంటే తెలంగాణ వస్తుండెనా?: కేటీఆర్​
  • కాలంతో పోటీపడి కాళేశ్వరాన్ని కట్టినం.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగినం
  • నీళ్లగోస తీరింది.. నిధులు వరదలై పారుతున్నయ్​.. నియామకాల కల సాకారమైతున్నది
  • గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులను మూసేసినం.. మన ఉద్యోగులకే జీతాలెక్కువ
  • దేశం చూపు సీఎం కేసీఆర్​ వైపే ఉంది.. ఆయన  ట్రైన్​ చేసిన సైనికులం మేం
  • వేరే రాష్ట్రాల సీఎంలు తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నరని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు కూడా నిండని పసిబిడ్డ తెలంగాణ ఇప్పుడు దేశం మొత్తానికి దారిచూపే దీప స్తంభంలా ఎదిగిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘‘నాటి తెలంగాణ.. ఉద్యమానికి టీచింగ్​ పాయింట్​ అయితే, ఇప్పటి తెలంగాణ.. ఉత్తమ పాలనలో దేశానికే టీచింగ్​ పాయింట్, టాకింగ్​ పాయింట్’’ అని చెప్పారు. తమది ముమ్మాటికీ కుటుంబ పాలనేనని అన్నారు. కేసీఆర్  జై తెలంగాణ అనకుంటే తెలంగాణ వస్తుండెనా అని కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం సాగిందని, ఇప్పుడు స్వరాష్ట్రంలో నీళ్లగోస తీరిందని, నిధులు వరదలై పారుతున్నాయని, నియామకాల కల సాకారమవుతున్నదని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా శనివారం అసెంబ్లీలో, కౌన్సిల్​లో కేటీఆర్  ప్రసంగించారు.  ‘‘కేసీఆర్​ది కుటుంబ పాలన అని మా మీద కొంత మంది విమర్శలు చేస్తున్నరు. యస్..  మాది కుటుంబ పాలనే. హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ పాలనే. ముమ్మాటికి కుటుంబ పాలనే. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబ సభ్యులే.ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్. బరాబార్ ఇది కుటుంబ పాలనే. కాదని ఎవరంటరో.. మేం కూడా చెప్తం” అని వ్యాఖ్యానించారు. వృద్ధులకు పెన్షన్ ఇచ్చి, కంటి వెలుగుతో జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తూ వాళ్లకు కేసీఆర్ పెద్ద కొడుకులా నిలబడ్డారని, రాష్ట్రంలోని 4 కోట్ల మందిని తోబుట్టువులా దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు. బస్తీలో పుట్టిన బిడ్డకైనా, బంజారా హిల్స్​లో పుట్టిన బిడ్డకైనా ‘కేసీఆర్ కిట్’ ఇస్తున్న మేనమామ కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తిస్తున్నా ఇక్కడి ప్రతిపక్షాలు గుర్తించడం లేదన్నారు.  ‘‘అబ్​ కీ బార్​ కిసాన్​ సర్కార్​ అనే నినాదాన్ని దేశం మొత్తం వినిపిస్తం” అని చెప్పారు. కేసీఆర్​ నాయకత్వంలో కదం తొక్కుతామన్నారు. ‘‘కేసీఆర్​ ట్రైన్​ చేసిన సైనికులం మేం. యుద్ధానికి వెరువం” అని కేటీఆర్​ చెప్పారు. 

తెలంగాణ మోడల్​కు దేశంలో సాటిలేదు

రాష్ట్రంలో సమీకృత, సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్నదని కేటీఆర్​ అన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయం నుంచి ఐటీ దాకా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరవేస్తున్నామని, ప్రతి ఊరిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘‘ఏదైనా సాధించాలంటే విజన్​ ఉంటే సరిపోదు.. దానిని అమలు చేసే యంత్రాంగం ఉండాలి. చిత్తశుద్ధి, వాక్​శుద్ధి, లక్ష్యసిద్ధి ఉండాలి. ఇదే కేసీఆర్​ నమ్మిన సిద్ధాంతం. తెలంగాణ మోడల్​కు దేశంలో సాటి లేదు’’ అని అన్నారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చితే అయ్యేదేమీ లేదని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ సాగుతున్నదని కేటీఆర్​ అన్నారు. దేశానికి కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు.  ‘‘రైతు బిడ్డే పాలకుడైతే సంక్షోభంలో చిక్కుకున్న సాగు సంబురమవుతుందని కేసీఆర్​ పాలనలో ఆవిష్కృతమైంది. రైతు బంధు కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65,558 కోట్లు జమ చేసినం. ప్రపంచంలోనే వినూత్న పథకమని యూఎన్​, ప్రపంచ బ్యాంకులు ప్రశంసలు కురిపించినయ్​. 70% రైతుబంధు సొమ్ము బడుగుబలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడుతున్నయ్​. రైతు చనిపోతే ఆ కుటుంబం అనాథలా మారొద్దన్న ఉద్దేశంతో రైతుబీమా ఇస్తున్నం. ఇప్పటిదాకా 94,500 కుటుంబాలకు రూ.4,725 కోట్ల బీమా ఇచ్చినం” అని ఆయన తెలిపారు. 

కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకున్నడు

కేంద్ర బడ్జెట్​లో ఏమీ లేదని కేటీఆర్​ విమర్శించారు. ‘‘ఆ బడ్జెట్​లో  ‘సరుకు లేదు.. సబ్జెక్ట్​ లేదు.. భజగోవిందం.. బభ్రజమానం’ అని కేసీఆర్​ చెప్పారు. అంతకుమించి అందులో ఏమీ లేదు” అని దుయ్యబట్టారు. ప్రతిపక్షమంటే ప్రతిసారీ పక్షపాతంగా ఉండాల్సిన అవసరం లేదని, ఎవరైనా మంచి చేసినప్పుడు ఆ మంచి చెప్పాలని అన్నారు. కానీ, ఇప్పుడు కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకుని వకీల్​ సాబ్​ మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావునుద్దేశించి కేటీఆర్​ వ్యాఖ్యానించారు. 

మన ఉద్యోగులకే జీతాలు ఎక్కువ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం రూ.1,46,000 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్​ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఏటా రూ.50 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని ఉద్యోగులకే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా 30% అలవెన్స్ ఇస్తున్నామని,  రాష్ట్రంలో గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులను మూసివేశామని తెలిపారు.  

పాలమూరుకే వలస వస్తున్నరు

ఏటా నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో నివేదిక ఇస్తుంటుందని, రైతు ఆత్మహత్యలపైనా రిపోర్ట్​ ఉంటుందని కేటీఆర్​ అన్నారు. అయితే, అందులో రైతులు ఇతర కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతు ఆత్మహత్యలుగానే లెక్కగడుతున్నారని  చెప్పారు. ఒకప్పుడు పాలమూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు జరిగితే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాలమూరుకు వలస వస్తున్నారని చెప్పారు. 

అమెరికా సంస్థలు అవార్డులిస్తున్నయ్​

ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ‘‘పంజాబ్​ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పాలనను చూసి నేర్చుకున్నరు. ఢిల్లీ సీఎం దిల్​ సే కితాబు ఇచ్చారు. అమెరికా సంస్థలు అవార్డులు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చేసేదేమీ లేక అవార్డులిస్తున్నది.  కేంద్ర సర్కారుకు కార్పొరేట్​ ముఖ్యమేమోగానీ.. మాకు మాత్రం కామన్​ మ్యానే ముఖ్యం. దేశంలో కావాల్సింది డబుల్ ఇంజన్​ సర్కార్​ కాదు.. తెలంగాణ లాంటి డబుల్​ ఇంపాక్ట్​ సర్కార్. ఇవాళ దేశం చూపు సీఎం కేసీఆర్​ వైపే ఉంది” అని ఆయన అన్నారు.    

మోడీ ఎందుకు దేవుడు?

మోడీ దేవుడని బీజేపీ వాళ్లు అంటున్నారని, అసలు మోడీ దేవుడెట్లా అయిండని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపినందుకా? రాష్ట్రానికి మెడికల్​ కాలేజీలు ఇవ్వనందుకా? గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచినందుకా? సబ్​ కా సాత్​ సబ్​ కా వికాస్​ అంటూ ఏం లేదు. సబ్​ కుచ్​ బక్వాస్​. రాష్ట్రానికి అండగా ఉండాల్సిన కేంద్రమే గండమై కూర్చుంది’’ అని మండిపడ్డారు. ఆకలినైనా భరిస్తంగానీ.. ఆత్మగౌరవం జోలికొస్తే మాత్రం ఊరుకోబోమని కేటీఆర్​ హెచ్చరించారు. రూపాయికి రూపాయిని తామేమీ కోరుకోవట్లేదన్నారు. కేంద్రానికి రూ.4,20,797 కోట్లు ఇచ్చామని, అందులో రూ.1,95,986 కోట్లే తిరిగిచ్చారన్నారు. మిగతా సొమ్మును ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వాడితే తెలంగాణకు గర్వమేనన్నారు.

మా రాజేందరన్నకు ఏదో అయ్యింది..

పాలకుడికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్​ రంగంలో అసాధారణ విజయాలు సాధించొచ్చని తెలంగాణ చాటిందని కేటీఆర్​ అన్నారు. ‘‘మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తుంటే.. మేం 24 గంటల కరెంట్​ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నం. కానీ, ప్రతిపక్షాలు ఉచిత కరెంట్​ ఎక్కడని అడుగుతున్నయ్​. మా  రాజేందర్​ అన్నకు కూడా అక్కడ (బీజేపీ)కి పోయినంక ఏదో అయింది. ఇక్కడున్నప్పుడు (టీఆర్​ఎస్​) బాగానే ఉంటుండే. అందులోకి పోతే అందరూ అట్లనే తయారైతరు.. మారిపోతరు” అని అన్నారు. ‘‘కరెంట్​ తీగలు పట్టుకుంటే ఫ్రీ కరెంట్​ ఎక్కడొస్తుందో తెలుస్తదని సభ్యులంటున్నారు. కానీ.. మిమ్మల్ని (బీజేపీ ఎమ్మెల్యేలు) నేను అడగను. ఎందుకంటే ఉన్నది ఇద్దరే’’ అని విమర్శించారు. 

కేటీఆర్.. సీఎం రోల్​

అసెంబ్లీ, కౌన్సిల్​లో  ముఖ్యమంత్రి పాత్రను మంత్రి కేటీఆర్​ పోషించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్​ స్థానంలో ఆయన రిప్లయ్​ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు గుప్పించారు. మధ్యమధ్యలో సెటైర్లు వేశారు. తన స్పీచ్​లో  అన్ని శాఖల వివరాలను కేటీఆర్ ప్రస్తావించారు. కవితలు, కథలు చెప్పారు. అసెంబ్లీలో అయితే ఏకంగా రెండు గంటలకు పైగా కేటీఆర్​ మాట్లాడారు. కౌన్సిల్​లో గంటకు పైగా స్పీచ్​ ఇచ్చారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి మాత్రమే రిప్లయ్​ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. దానికి కేసీఆర్​సర్కార్ బ్రేక్​లు వేసింది. ఉమ్మడి ఏపీలోనూ సీఎంకు బదులు మంత్రులు గవర్నర్​ స్పీచ్​కు రిప్లయ్​ ఇచ్చిన దాఖలాలు లేవని సీనియర్​ ఎమ్మెల్యేలు అంటున్నారు. కానీ, ఇప్పుడు సీఎం రోల్​ను కేటీఆర్​ పోషించడం హాట్​టాపిక్​గా మారింది.

మోడీ ఉద్యోగాలిచ్చినంక నిరుద్యోగ భృతి ఎందుకు?

నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్ రావు​, మంత్రి కేటీఆర్​ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మూడేండ్లవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని రఘునందన్​ ప్రశ్నించారు. ‘‘2019 జనవరి నుంచి కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పట్లో కేటీఆర్​ చెప్పిన్రు. ఎలక్షన్​ మేనిఫెస్టోలో కూడా పెట్టిన్రు. మూడేండ్లు అయినా దాన్ని అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని గవర్నర్​ స్పీచ్​లో పెట్టాల్సింది” అని ఆయన అన్నారు. దీనికి మంత్రి కేటీఆర్​ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘కేంద్రం సహకరించకపోయినా.. మేమే ఉజ్వలంగా ముందుకు పోతున్నం. నాస్కామ్​ డేటా ప్రకారం నిరుడు దేశంలో ఐటీ రంగంలో 4.50 లక్షల ఉద్యోగాలు వస్తే.. అందులో లక్షా 50వేల ఉద్యోగాలు హైదరాబాద్​లో వచ్చినయ్​. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తమని మోడీ అన్నరు. ఆ లెక్కన ఇప్పటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలె. మోడీనే అన్ని ఉద్యోగాలు ఇచ్చినంక ఇంకా నిరుద్యోగ భృతి ఎందుకు? మీలెక్కల ప్రకారం నిరుద్యోగులు ఎక్కడున్నరో చెప్పాలె? మొత్తం అమృత్​ కాల్​ రానే వచ్చె.. అచ్ఛే దిన్​ వచ్చింది.. ఎక్కడున్నరు నిరుద్యోగులు మీరే చెప్పాలి” అంటూ దుయ్యబట్టారు. 

కాళేశ్వరాన్ని డిస్కవరీ చానెల్ గుర్తించింది

దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణలో ఇవాళ సాగునీటి రంగం దూసుకొని ముందుకు వెళ్తున్నది. గూగుల్​లో కొడితే.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భారతదేశంలోని తెలంగాణలో ఉందని చెప్తది. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేస్తూ.. కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కట్టినం. ఒకప్పుడు రాజన్న సిరిసిల్ల కరువు కాటకాలకు పేరుబడ్డ జిల్లా. కాళేశ్వరం పుణ్యం వల్ల అక్కడ భూగర్భజలాలు 6 మీటర్లు పైకి వచ్చినయ్.. బోర్లు ఉల్టా కొడ్తున్నయ్. కాళేశ్వరాన్ని డిస్కవరీ చానెల్ గుర్తించింది. లిఫ్టింగ్ ఎ రివర్.. అని ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టింది. 80 మీటర్ల సముద్రమట్టం నుంచి 618 మీటర్ల పైకి నదినే మల్పుతున్నరని
మన ఇంజనీర్లను, మన సీఎం పనితనాన్ని కీర్తించింది. దీన్ని కూడా ప్రతిపక్షాలు గుర్తిస్తలేవ్.

- మంత్రి కేటీఆర్