కేసీఆర్ కుడి చేత్తో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేత్తో లాక్కుంటోంది

కేసీఆర్ కుడి చేత్తో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేత్తో లాక్కుంటోంది
  • ఇల్లందకుంటలో మంత్రి హరీష్ రావు

కరీంనగర్: సీఎం కేసీఆర్ కుడి చేత్తో ఇస్తుంటే.. కేంద్రం ఎడమ చేత్తో లాక్కుంటోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి  కళ్యాణ మండపంలో స్వశక్తి మహిళా సంఘాలకు వడ్డిలేని ఋణాలు, బ్యాంక్ లింకేజి మరియు స్త్రీనిధి ఋణాలు చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి  తన్నీరు హరిష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మాట తప్పని ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ఉసురు పోసుకుంటోందని ఆరోపించారు. మాయ మాటలు.. మోసపూరిత మాటలను నమ్మొద్దని ఆయన సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో ఆలోచించాలన్నారు. న్యాయం, ధర్మం వైపు నిలబడండి.. కష్టపడే వాళ్లను ఆశీర్వదించాలని కోరారు. 
ఒక్క ఇల్లందకుంట మండలానికే వడ్డీ లేని రుణాలు రూ. 3.14 కోట్లు వచ్చాయని, ఒక్క రూపాయి బాకీ లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, స్త్రీ నిధి కింద రూ. 1.30 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, బతుకమ్మ పండుగకు అందాలని ఇస్తున్నామన్నారు. ఇల్లందకుంటలో ఒక్క ఊరిలో కూడా మహిళా భవనం లేదని, 18 గ్రామాల్లో 18 మహిళా భవనాలకు రూ. 2.36 కోట్లు మంజూరు చేశామనన్నారు. 4 నెలల్లో అన్ని ఊర్లలో మహిళా భవనాలు పూర్తి చేసి ప్రారంభిస్తామని వివరించారు. ఇల్లందకుంటలో మండల సమాఖ్య భవనానికి కూడా రూ. 50 లక్షలు మంజూరు.. బిల్డింగ్ లో కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. 
నియోజకవర్గానికి 17 ఏళ్లు ఎమ్మెల్యే, మంత్రిగా వ్యక్తి ఒక్క మహిళా సంఘం భవనం కూడా కట్టలేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతీ పేదింటి ఆడపిల్లకు రూ. లక్షా 116 ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేశామని, భారత దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లికి రూ. లక్ష ఇస్తున్నారా.. కలలోనైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే వేలకు వేలు తీసుకునేవాళ్లు.. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేశామన్నారు.
గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై లక్షన్నర ఖర్చు చేస్తున్నాం
రాష్ట్రంలోని 930 గురుకులాల్లో చదివే పిల్లలపై ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా 50 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు వివరించారు. పెన్షన్లు పెరిగాక వృద్ధులకు గౌరవం పెరిగిందని, అందుకే త్వరలో 57 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పరిగి ఏరుకున్నట్టు అని కొందరు అంటున్నారు, అలాంటి మాటలు న్యాయమేనా ఆలోచించాలన్నారు. 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? వ్యవసాయనికి బావుల దగ్గర మీటర్లు పెడ్తామంటున్న బీజేపీ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. బొట్టు బిళ్లలు, గడియారాలు, కుట్టు మిషన్లకు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుందామా? అలాంటి వారికి మహిళా శక్తి చూపించాలి, పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. మహిళల కోసం ఏ ఊరికి ఆ ఊరికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుందామని సూచించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి మనకు ఏమైనా సాయం అందిందా ఆలోచించాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె, గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ కాదా?
సీఎం కేసీఆర్ 5 ఏళ్ల క్రితం 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే.. ఈ ప్రాంతంలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు.. దానికి కారణం ఎవరో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 5 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తాం, రూ. 10 కోట్లతో ఇల్లందకుంట ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

కొత్త ఎమ్మెల్యే వచ్చే వరకు ప్రతీ పని చేసే బాధ్యత మాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండు నెలలుగా ఇల్లందకుంటలో రూ. 17 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ మహిళల్లో ఎంతో అవగాహన పెరిగిందని,  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఎంతో ప్రయోజనం జరిగిందన్నారు. ఎంతో మంది మహిళలను బలితీసుకున్న మైక్రో ఫైనాన్స్ బాధలు లేకుండా పోయాయన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా అక్కాచెల్లెళ్లు వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.