
CEIR పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన మొబైల్ ఫోన్లను మే 4వ తేదీ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు అందజేశారు జిల్లా ఎస్పీ అపూర్వారావు. అనంతరం ఆయన మీడిమాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.
"మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ లో ఫిర్యాదు చేయొచ్చు. ఈ సైట్ పై అవగాహన కల్పిస్తున్నాం. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన ఫోన్ లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి.
ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది. సంబంధిత ఐడితో ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని.. CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి" అని ఎస్పీ అపూర్వారావు వివరించారు.
ఇక మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి( గతంలో ఐటీ అండ్ టెక్నికల్ ఎక్స్పెక్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది) సిబ్బంది బాలకోటి, శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు ఎస్పీ అపూర్వరావు.