
- రాష్ట్రంలో బీజేపీ ఓట్లు పెరిగేలా కృషి చేయాలని కార్యకర్తలకు రాంచందర్ రావు పిలుపు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు శాతం పెరుగుతోందని, ఇది మరింత పెరిగేలా కృషి చేయాలని కోరారు. మంగళవారం ఘట్‌కేసర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలపాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు.
ఇది బీసీలకు వ్యతిరేకమన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ గతంలోనే వ్యతిరేకించిందని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం ఇలా చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో బీజేపీ బలం పెరుగుతోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో బీజేపీ ఓటు శాతం, ప్రాతినిధ్యం పెరుగుతోందని, ఇది పార్టీ బలానికి నిదర్శనమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రోడ్ మ్యాప్..
- జులై 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయి వర్క్‌షాప్
- 21, 22, 23 తేదీల్లో మండల స్థాయి వర్క్‌షాప్
- 25, 26న పోలింగ్ బూత్ బైఠక్
- 29, 30న మహా సంపర్క్ అభియాన్.. దేవాలయాల సందర్శన, డోర్ టు డోర్ క్యాంపెయిన్
- ఆగస్టు 1,2,3న మండలాల్లో..
- 4, 5 తేదీల్లో జిల్లాల్లో ర్యాలీలు
- 9, 10 తేదీల్లో మండల సమ్మేళనాలు
- ఆగస్టు 11 - 20 వరకు మోర్చాల సమావేశాలు